బీజేపీలో మధనం : సోము మాటకు కట్టుబడేది ఎందరు...?

Update: 2022-05-16 17:30 GMT
ఏపీ బీజేపీలో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి రావుల కిషోర్ బాబు రాజీనామా చేశారు. ఆయన టీడీపీ జనసేన, బీజేపీలను గత ఎనిమిదేళ్లలో చుట్టేసారు. ఇక ఎన్నికలు రెండేళ్ళు ఉంటాయనగానే కాషాయనికి రాం రాం అనేశారు. ఆయన మళ్లీ టీడీపీలో చేరుతారు అని అంటున్నారు. గుంటూరు జిల్లాలో బలమైన నేత, దళిత నాయకుడు కిశోర్ బాబు రాజీనామా చేయడం అంటే షాకే మరి

మరి రావెల బాటలో ఎంతమంది నడుస్తారు అన్నది కూడా చర్చగా ఉంది. నిజానికి ఏపీ బీజేపీకి పెద్దగా బలం లేదు. ఉన్న వారు అంతా కూడా ఎన్నికల సమరంలో గెలిచిన వారు కాదు. ఇక కేంద్రంలో  మోడీ సర్కార్ ఉందని భావించి ఇతర పార్టీల నుంచి చేరిన బడా నాయకులు అంతా కూడా ఇపుడు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు.

మరో వైపు చూస్తే వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు వద్దు అంటూ ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు పదే పదే చేస్తున్న ప్రకటనల వల్ల కూడా చాలా మంది అభద్రతాభావానికి లోను అవుతున్నారు అంటున్నారు. ఏపీలో బీజేపీకి సొంతంగా పెద్దగా బలం లేదు, అదే టైమ్ లో టీడీపీ జనసేన కూటమిలో చేరితే 2014లో జరిగినట్లుగా మూడో నాలుగో సీట్లు వస్తాయన్న ఆశలు ఉన్నాయి.

అలా కాకుండా టీడీపీకి మేము వ్యతిరేకం అని చెబుతూ ఉంటే నిలువునా కమలం కమిలిపోవడం ఖాయమనే అంటున్నారు. అదే టైమ్ లో బీజేపీ తో పొత్తు తెంచుకునే దిశగా జనసేన కూడా ఉందని వార్తలు వస్తున్నాయి. దాంతో బీజేపీ టికెట్ మీద పోటీ చేసి నెగ్గుకురావడం అన్నది జరిగే పని కాదని తెలిసిన వారు, తెలివిడి కలవారు తమ దారి తాము చూసుకుంటున్నారు.

మరో వైపు బీజేపీలో ఉంటున్న వారిలో సోము వర్గం తప్ప మిగిలిన వారంతా పొత్తులను కోరుకుంటున్నారు. ఎన్నికల్లో పొత్తుల ఎత్తులు మామూలే అని అంటున్నారు. చంద్రబాబుతో పొత్తు అన్నది రాజకీయ వ్యూహంగా చూడాలి తప్ప పాత విషయాలు తవ్వుకోడం తగదని చెబుతున్నారు. మోడీని అమిత్ షాని చంద్రబాబు గతంలో ఏదో అన్నారని పొత్తు వద్దు అనుకుంటే ఇంతకంటే ఘోరంగా శివసేన నాయకులు మహారాష్ట్రలో బీజేపీని విమర్శిస్తున్నారని వారు అంటున్నారు.

అక్కడ మళ్లీ పొత్తులకు శివసేన, బీజేపీ సిద్ధపడవా అని ప్రశ్నిస్తున్నారు. ఇక ఏపీలో ఇపుడున్న రాజకీయ పరిస్థితుల్లో బీజేపీ టీడీపీతో కలసివెళ్లడమే ఉత్తమమని అంటున్నారు. అలా కాదూ కూడదని కూర్చుంటే పార్టీయే నష్టపోతుందని అంటున్నారు. ఈ విషయాలను  కేంద్ర బీజేపీ నాయకుల దృష్టికి కూడా  తీసుకురావడానికి కొందరు కీలక నాయకులు రెడీ అవుతున్నారు అంటున్నారు. మొత్తానికి టీడీపీతో పొత్తుకు సోము వర్గం తప్ప మిగిలిన వారు, అందునా కాపు సామాజికవర్గం నేతలు కూడా సై అనడమే ఇక్కడ విశేషం. మరి చూడాలి కేంద్ర పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారో.
Tags:    

Similar News