విశాఖలో రెచ్చిపోయిన మరో ప్రేమోన్మాది.. ప్రియురాలు గొంతుకోసి ,ఆత్మహత్య కి యత్నం !

Update: 2020-12-02 09:37 GMT
విజయవాడలో ప్రేమోన్మాది ఘాతుకం ఘటన ఇంకా పూర్తిగా మరువకముందే మరో ఘటన విశాఖలో చోటుచేసుకుంది. ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత  ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ సంఘటన విశాఖపట్నం వన్ ‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బుధవారం జరిగింది. ఫెర్రి జంక్షన్ ప్రాంతానికి చెందిన యువతి వార్డు వాలంటీర్ ‌గా పనిచేస్తోంది. ఆమె మరొకరితో చనువుగా ఉంటోందని అనుమానం పెంచుకున్న ప్రియుడు శ్రీకాంత్ ఆమె పై కత్తితో దాడి చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

యువతి ఇంట్లో ఉన్న సమయంలో మెడపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో యువతికి తీవ్రగాయాలయ్యాయి. దాడి అనంతరం కూతురిపై హత్యాయత్నం చేశానని ఆమె తల్లిదండ్రులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత  తాను కూడా మెడపై కత్తితో కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికులు ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలు కేజీహెచ్ లో  చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఈఎన్‌ టీ వైద్యుల పర్యవేక్షణలో ప్రియాంకకు చికిత్స అందుతోంది. ఆమె గొంతు దగ్గర కోయటంతో తీవ్ర రక్తస్రావం అయింది. యువతి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది.  రెండేళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలు బయటికి వస్తున్నాయి. ప్రేమ వ్యవహారాన్ని ప్రియురాలి ఇంట్లో ఒప్పుకోకపోవడంతో ఆమె ప్రియుడిని దూరం పెట్టినట్లు తెలుస్తోంది. దానికితోడు ఆమెపై అనుమానం పెంచుకుని ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.
Tags:    

Similar News