హైదరాబాద్ లో మరో ప్రేమోన్మాది ఘాతుకం .. యువతిపై కత్తితో దాడి !

Update: 2021-03-03 07:46 GMT
ఈ మధ్య ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్న ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. తనను ప్రేమించలేదని ఒకరు.. ప్రియురాలిపై అనుమానంతో మరొకొరు, ప్రేమించి మరో పెళ్లి కి సిద్ధం అయింది అని మరొకరు ..  అమ్మాయిలపై దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ శివారులో దారుణం జరిగింది. ప్రేమించిన అమ్మాయి తనను మోసం చెేసి, వేరొకరితో పెళ్లికి సిద్ధమైందన్న కోపంతో  ఓ యువతిపై యువకుడు దాడిచేశాడు. గుండిపేట మండలం హైదర్షాకోట్ ప్రాంతంలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది.

వివరాల్లోకి వెళ్తే .. హైదర్షాకోట్‌ లక్ష్మీనగర్‌ కాలనీలో ఓ యువతి తల్లిదండ్రులతో కలసి నివాసం ఉంటుంది. గచ్చిబౌలిలోని ఓ సంస్థ లో  సాఫ్ట్ ‌వేర్‌ ఉద్యోగిగా పని చేస్తుంది. ఆమెకి  స్థానికంగా ఓ సెలూన్‌ లో పనిచేసే హరియాణా నివాసి షారుక్ ‌సల్మాన్‌ తో రెండేళ్ల క్రితం పరిచయమైంది. ప్రేమ పేరుతో అతడు తనను తరచుగా వేధించడంతో ఆమె షీ టీమ్‌కు ఫిర్యాదు చేసింది. అయినా అతడి వేధింపులు ఆగలేదు. ఈ క్రమంలోనే ఆమెకు వచ్చే మే నెలలో పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు. ఈ విషయం అతడికి తెలియడంతో షారుక్‌ సల్మాన్‌ మంగళవారం మధ్యాహ్నం ఆమె ఇంటికి వెళ్లి ఆమెతో మాట్లాడాడు. మళ్లీ రాత్రి 8 గంటల సమయంలో ఆమెను ఇంట్లో నుంచి పక్కకు తీసుకెళ్లి  తనను ప్రేమించాలని ఒత్తిడి చేశాడు. దానికి ఆమె తిరస్కరించడంతో కత్తితో ఆమె కడుపులో పొడిచాడు.

అనంతరం అక్కడి నుంచి పారిపోతుండగా స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారు. దుండగుడి దాడిలో గాయపడిన యువతిని లంగర్‌హౌస్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె వీపు భాగంలో రెండు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె శరీరంపై మరో రెండు చిన్న గాయాలు కూడా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఆమె కోలుకుంటోందని తెలిపారు.

అప్పా రేడియల్‌ రోడ్డుపై ఎడమ పక్కన ఈ ఘటన జరగ్గా, అదే సమయంలో కుడి పక్కన ఉన్న జీఆర్‌ కే గార్డెన్ ‌లో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఒక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. యువతిపై ప్రేమోన్మాది దాడి విషయం తెలియగానే ఆయన ఆస్పత్రికి వెళ్లి ఆమెను పరామర్శించేందుకు ప్రయత్నించారు. కానీ, పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు.  పోలీసులు అనుమతించకపోవడంతో.. యువతిని మెరుగైన వైద్యం కోసం వెంటనే యశోద ఆస్పత్రికి తరలించాలని బండి సంజయ్‌ మాదాపూర్‌ డీసీపీకి సూచించి వెళ్లిపోయారు. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు.
Tags:    

Similar News