శివసేనకు షాకిచ్చిన పవార్..బీజేపీని బతిమాలుకుంటున్న ఉద్ధవ్

Update: 2019-11-18 14:21 GMT
మహారాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా మలుపు తీసుకుంది. బీజేపీని కాదని ఎన్సీపీ - కాంగ్రెస్ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలన్న శివసేన ఆశలపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నీళ్లు చల్లారు. శివసేన - బీజేపీలు కలిసి పోటీ చేశాయి కాబట్టి ప్రభుత్వం కూడా వారే ఏర్పాటు చేసుకోవాలంటూ మళ్లీ మాట మార్చారు. అయితే, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ఆయన ఈ రోజు భేటీ అయ్యారు. సోనియా నివాసంలోనే పవార్ ఆమెతో భేటీ అయ్యారు. అయితే వీరిద్దరూ ఏం చర్చించుకున్నారో తెలియలేదు. సోనియాతో సమావేశం కావడానికి ముందు పవార్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ తన రాజకీయాలు తాను చేస్తుంటే తమ రాజకీయాలు తాము చేస్తున్నామని చెబుతూనే ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన తమ పార్టీతో చర్చిస్తున్న విషయం తనకు తెలియదని అన్నారు.

కాగా కేసుల భయంతో బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయాలు చేయడానికి పవార్ వెనుకాడుతున్నారని రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. కారణమేదైనా శరద్ పవార్ హ్యాండివ్వడంతో శివసేన ఒక్కసారిగా షాకై మళ్లీ బీజేపీతో ఒప్పందానికి ప్రయత్నిస్తోంది. ఇంతవరకు ఎన్సీపీ - కాంగ్రెస్‌ లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలనన్న ధీమాతో బీజేపీతో రాజకీయాన్ని తెగే వరకు లాగిన శివసేన మళ్లీ ఇప్పుడు అదే పార్టీతో చర్చలకు రెడీ అవుతోంది.

రాష్ట్రపతి పాలన ఏర్పడే వరకు కూడా ఒక్క మెట్టు కూడా దిగని శివసేన ఇప్పుడు తొలి మూడేళ్లు బీజేపీ సీఎం పదవి తీసుకుని తరువాత రెండేళ్లు తమకిచ్చినా ఫర్వాలేదని ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది. అయితే.. అన్ని ప్రయత్నాలూ చేసి విఫలమై మళ్లీ తమ వద్దకే వచ్చిన శివసేనతో బీజేపీ ఎలా వ్యవహరిస్తుందన్నది ఇప్పుడు చూడాలి.


Tags:    

Similar News