మమత దూకుడుకు శివసేన బ్రేకులు ?

Update: 2021-12-06 06:27 GMT
మంచి దూకుడు మీదున్న ఫైర్ బ్రాండ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దూకుడుకి శివసేన పగ్గాలు వేస్తుందా ? తాజాగా శివసేన పత్రిక సామ్నాలో వచ్చిన సంపాదకీయాన్ని చూస్తుంటే అందరిలో ఇదే అనుమానాలు పెరుగుతున్నాయి.

నరేంద్రమోడిని, బీజేపీని మమత తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. రాబోయే షెడ్యూల్ పార్లమెంటు ఎన్నికల్లోనే ఏన్డీయేని ఓడించాలని మమత చాలా గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.

అయితే తన ప్రయత్నాల్లో ఒకవైపు మోడీకి వ్యతిరేకంగాను మరోవైపు కాంగ్రెస్ కు వ్యతిరేకంగాను ఫైర్ బ్రాండ్ రాజకీయ వ్యూహాలను పన్నుతున్నారు. ఈ విధానాలనే శివసేన తప్పుపడుతోంది.

మోడిని ఓడించాలంటే కాంగ్రెస్ సహకారం లేకుండా సాధ్యమయ్యే పని కాదని మమతకు గట్టిగా చెప్పింది. మోడీని ఓడించటమంటే కాంగ్రెస్ ను వ్యతిరేకించటం కాదని మమత తెలుసుకోవాలని శివసేన గట్టిగా చెప్పింది. నాన్ ఎన్డీయే, నాన్ యూపీఏ పార్టీలను ఏకం చేయాలన్న మమత ప్రయత్నాలు మంచివే అని పార్టీ అభినందించింది.

అయితే మమత ప్రయత్నాల వల్ల ప్రతిపక్షాల మధ్య ఓట్లు చీలిపోతే లాభపడేది బీజేపీయే అన్న విషయాన్ని మమత మరచిపోయినట్లున్నారంటు గట్టిగానే చురకలంటించింది. కాంగ్రెస్ ను వ్యతిరేకించటమంటే మమత బీజేపీని బలోపేతం చేయటమే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించింది.

కాంగ్రెస్ లేకుండా ఎన్డీయే వ్యతిరేక శక్తుల బలోపేతం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదని శివసేన తేల్చి చెప్పేసింది. కాబట్టి నాన్ యూపీఏ కూటమి ఏర్పాటు ప్రయత్నాలను మమత మానుకోవాలని గట్టిగానే చెప్పింది.

తృణమూల్ కాంగ్రెస్ ను జాతీయ రాజకీయాల్లో బలమైన పార్టీగా తయారు చేయాలన్న మమత ప్రయత్నాల్లో ఎలాంటి తప్పులేదన్నారు. కానీ ఆ ప్రయత్నాల్లో వాస్తవాన్ని మమత మరచిపోతున్నారని శివసేన ఎద్దేవా చేసింది. ప్రతిపక్షాల మధ్య ఓట్లు ఎంతగా చీలిపోతే అంతిమంగా లాభపడేది అధికార పార్టీయే అన్న చిన్న విషయాన్ని మమత మరచిపోయినట్లున్నారంటు శివసేన గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది.

అంటే శివసేన తాజా వైఖరి చూస్తుంటే మమత దూకుడుకు బ్రేకులు వేయాలని నిర్ణయించుకున్నట్లు అర్ధమవుతోంది. కాంగ్రెస్ మీదున్న గుడ్డి వ్యతిరేకత కారణంగా మమత కూడా క్షేత్ర స్థాయిలో వాస్తవాన్ని మరచిపోయినట్లున్నారు. బహుశా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సూచనలు, సలహాల కారణంగానే మమత వాస్తవాలకు దూరంగా ఆలోచిస్తున్నారేమో అనిపిస్తోంది.

కాంగ్రెస్ అంటే తనకున్న మంటనంతా పీకే ఇపుడు మమతకు కూడా ఎక్కిస్తున్నట్లున్నారు. అసలే కాంగ్రెస్ అంటే మండిపోయే ఫైర్ బ్రాండ్ ద్వారా పీకే తన కసిని తీర్చుకుంటున్నాడా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరి శివసేన చెప్పిన తర్వాతైనా దీదీ ఆలోచిస్తుందా ?


Tags:    

Similar News