సెకండ్ వేవ్ బాధితులు.. ఇప్పుడు ఆసుప‌త్రుల‌కు ప‌రుగు.. కొత్త రోగమే కార‌ణం!

Update: 2021-08-05 01:30 GMT
మ‌నిషి ఆరోగ్య వ్య‌వ‌స్థ‌పై క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం ఎంత‌? ఈ ప్ర‌శ్న‌కు ఎవ్వ‌రూ పూర్తిగా స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితి. ఎందుకంటే.. ఒంట్లో ఉన్నంత వ‌ర‌కూ ప‌లుర‌కాల ప్ర‌భావాలు చూపుతున్న ఈ వైర‌స్.. త‌గ్గిపోయిన త‌ర్వాత కూడా మ‌రో విధంగా ఎఫెక్ట్ చూపిస్తోంది. మ‌రిన్ని కొత్త రోగాల‌కు కార‌ణ‌మ‌వుతోంది. ఇలాంటి వాటిల్లో ఒక‌టి బ్లాక్ ఫంగ‌స్. క‌రోనా వ‌చ్చి త‌గ్గిపోయిన వారిలో బ్లాక్ ఫంగ‌స్ ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో తెలిసిందే. అయితే.. తాజాగా మ‌రో కొత్త రోగం వెలుగులోకి వ‌చ్చింది. ఎముక‌ల స‌మ‌స్య బాధిస్తోంద‌ని, ప్ర‌ధానంగా తుంటి స‌మ‌స్య వేధిస్తోంద‌ని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు. సెకండ్ వేవ్ లో క‌రోనా వ‌చ్చి త‌గ్గిపోయిన వారంతా.. ఈ స‌మ‌స్య‌తో ఇప్పుడు ఆసుప‌త్రుల‌కు ప‌రుగులు తీస్తుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

క‌రోనా వ‌చ్చి త‌గ్గిపోయిన‌ త‌ర్వాత అటాక్ చేసే రోగాల్లో బ్లాక్ ఫంగ‌స్ అగ్ర‌స్థానంలో ఉన్న సంగ‌తి తెలిసిందే. మ్యూకోర్ మైకోసిస్ ఇన్ఫెక్ష‌న్ గా పిలిచే బ్లాక్ ఫంగ‌స్.. ఎప్పుడు ఎవ‌రిపై అటాక్ చేస్తుందో చెప్ప‌లేని ప‌రిస్థితి. మొద‌ట్లో.. ఉత్త‌ర భార‌తంలోనే ఎక్కువ‌గా బ‌య‌ట‌ప‌డ్డ ఈ కేసులు.. ఆ త‌ర్వాత సౌత్ కు సైతం విస్త‌రించాయి. ఊపిరితిత్తుల్లో తిష్ట వేస్తున్న ఈ ఫంగ‌స్ కార‌ణంగా.. ఛాతిలో నొప్పి, ఊపిరి అంద‌క‌పోవ‌డం, ద‌గ్గు వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. అయితే.. ఈ వైర‌స్ కార‌ణంగా చూపు కోల్పోయే ప్ర‌మాదం ఉండ‌డం.. అత్యంత ఆందోళ‌న క‌లిగించే అంశం. చూపుకోల్పోవ‌డంతోపాటు నోట్లో ఫంగ‌స్ తీవ్రంగా వ్యాపించి ద‌వ‌డ తీసేయాల్సి రావ‌డం వంటి విప‌రీతాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. కొవిడ్ చికిత్స తీసుకున్న వారికి ఎక్కువ‌గా స్టెరాయిడ్స్ వాడిన‌ప్పుడు ఇమ్యూనిటీ దెబ్బ‌తిన‌డంతో.. ఈ ఫంగ‌స్ వ్యాపిస్తోంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి కేసులు తెలుగు రాష్ట్రాల్లో.. ఏపీలోనే ఎక్కువ‌గా న‌మోద‌య్యాయి. బ్లాక్ ఫంగ‌స్ మ‌ర‌ణాలు కూడా పెరుగుతూ వ‌చ్చాయి.

అయితే.. ఇప్పుడు మ‌రో కొత్త‌రోగం పుట్టుకొచ్చింది. అదే.. తుంటి నొప్పి. చూడ్డానికి ఇదో సాధార‌ణ స‌మ‌స్య‌గా క‌నిపిస్తుంది. కానీ.. తీవ్ర‌మ‌య్యే కొద్దీ అస‌లు ప్ర‌భావం చూపుతోంద‌ట‌. ఇది కూడా.. క‌రోనా వైర‌స్ వ‌చ్చిన‌పోయిన వారికి వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. బ్లాక్ ఫంగ‌స్ మాదిరిగానే.. ఇది కూడా అటాక్ చేస్తోంది. అయితే.. బ్లాక్ ఫంగ‌స్ కొవిడ్ త‌గ్గిన త‌ర్వాత కొన్ని రోజుల‌కే వ‌స్తుండ‌గా.. ఈ తుంటి నొప్పి స‌మ‌స్య మాత్రం కొవిడ్ నుంచి పూర్తిగా బ‌య‌ట‌ప‌డిన మూడ్నాలుగు నెల‌ల త‌ర్వాత త‌లెత్తుతోంద‌ని నిపుణులు చెబుతున్నారు.

వైద్య ప‌రిభాష‌లో దీన్ని ''ఏవాస్కుల‌ర్ నెక్రోసిస్‌'' అని పిలుస్తారు. కరోనా నుంచి కోలుకున్న వారిలో ఇది ఎక్కువగా వస్తోంది. అయితే.. దీన్ని గుర్తించ‌డం కూడా ఆల‌స్య‌మ‌వుతుండ‌డం మ‌రో స‌మ‌స్య‌. బ్లాక్ ఫంగ‌స్ వ‌చ్చిన వారిలో స‌మ‌స్య‌ను త్వ‌ర‌గానే గుర్తించే వీలుంది. కానీ.. ఈ తుంటి నొప్పుల స‌మ‌స్య మాత్రం మూడు, నాలుగు నెల‌ల త‌ర్వాత బ‌య‌ట‌ప‌డ‌డం కూడా ఇబ్బందిక‌రంగా మారుతోంద‌ని నిపుణులు చెబుతున్నారు. సెకండ్ వేవ్ లో కొవిడ్ బారిన ప‌డి, స‌మ‌స్య త‌గ్గిన‌వారు ఇప్పుడు ఆసుప‌త్రుల‌కు ప‌రుగులు తీస్తున్నార‌ని వైద్యులు చెబుతున్నారు.

ఈ రోగంలో మొత్తం నాలుగు ద‌శ‌లు ఉన్నాయ‌ట‌. తొలి రెండు స్టేజీల్లో స‌మ‌స్య‌ను గుర్తించి, వైద్యుడిని సంప్ర‌దిస్తే.. లాప్రోస్కోపిక్ స‌ర్జ‌రీ విధానంలో చిన్న రంద్రం చేసి.. పాడైపోయిన ప్రాంతాన్ని తొల‌గిస్తారు. అయితే.. మూడు, నాలుగు ద‌శ‌ల‌కు చేరితే మాత్రం ఆప‌రేష‌న్ కంప‌ల్స‌రీ అని, తుంటి మార్పిడి చేయాల్సిందేన‌ని అంటున్నారు. అందువ‌ల్ల నిర్ల‌క్ష్యం చేయొద్ద‌ని, స‌మ‌స్య క‌నిపిస్తే.. వెంట‌నే ఆర్థ‌రైటిస్ స్పెష‌లిస్టును క‌ల‌వాల‌ని సూచిస్తున్నారు.
Tags:    

Similar News