మోడీ బ్యాచ్ కి షాట్ గన్ సవాలు

Update: 2016-01-07 06:53 GMT
తనకు తిరుగులేదన్నట్లుగా సాగుతున్న మోడీ అండ్ కోకు స్వపక్షంలోనే తలనొప్పులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఓపక్క పార్టీ సీనియర్ నేతల అసంతృప్తి మరోవైపు.. అరుణ్ జైట్లీ.. కీర్తి అజాద్ ల పంచాయితీల పుణ్యమా అని కిందామీదా పడుతున్న ఆ పార్టీకి షాట్ గన్ శత్రుఘ్న సిన్హా తాజా తలనొప్పిగా మారారు. బీహార్ ఎన్నికల సమయంలోనూ.. ఆ తర్వాత వరుస విమర్శలు చేస్తూ పార్టీని ఇబ్బంది పెడుతున్న ఆయన.. తాజాగా మరోమారు తన నోటికి పని చెప్పి మోడీ బ్యాచ్ కి ‘సినిమా’ చూపిస్తున్నారు.

తరచూ తన వ్యాఖ్యలతో పార్టీని ఇరుకున పడేస్తున్న శత్రుఘ్నసిన్హా మీద కూడా కీర్తి అజాద్ మాదిరే చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తున్న నేపథ్యంలో షాట్ గన్ నోరు విప్పారు. దమ్ముంటే.. తన మీద చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ అధినాయకత్వానికి సవాలు విసురుతున్నారు. ఈ సవాలు బీజేపీకి అన్నీ తానై నడిపిస్తున్న ప్రధాని మోడీకే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తాను పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి పని చేయలేదని.. అయినప్పటికీ తనను పార్టీ నుంచి గెంటేయాలని అనుకుంటే గెంటేయొచ్చన్నశత్రుఘ్న సిన్హా.. చర్యకు ప్రతిచర్య కూడా ఉంటుందన్న న్యూటన్ థర్డ్ థియరీని గుర్తు పెట్టుకోవాలంటూ ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ మధ్యనే పార్టీ చర్యలు తీసుకున్న కీర్తి అజాద్ ను పొగిడేస్తూ.. ట్విట్టర్ లో వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో షాట్ గన్ వ్యవహారశైలి ఇప్పుడు బీజేపీలో హాట్ టాపిక్ గా మారిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News