సింగపూర్ లో చంద్రబాబు లేడుగా??

Update: 2017-11-10 04:09 GMT
చంద్రబాబునాయుడు తన సొంత పార్టీ నాయకులకు చేసిన హితబోధల విషయంలో ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేల్లోనే రకరకాల జోకులు పేలుతున్నాయి. సింగపూర్ లో ప్రతిపక్షం లేదు.. అధికార పార్టీ వాళ్లు యథేచ్ఛగా ప్రజల సమస్యలను ప్రస్తావించవచ్చు.. ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉండవచ్చు.. అధికార పార్టీ కూడా తమ సభ్యులకే జవాబులు చెప్పాలి..! ఇదీ చంద్రబాబునాయుడు తన పార్టీ వారికి చెప్పిన సింగపూర్ ఆదర్శ సిద్ధాంతం. అక్కడి చట్టసభ రీతిలో... ఈసారి మనం కూడా జగన్ దళం లేకుండా చాలా ఆదర్శనీయంగా పద్ధతి ప్రకారం హుందాగా శాసనసభు నిర్వహిద్దాం.. అని చంద్రబాబునాయుడు చెప్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు పార్టీలో వినిపిస్తున్న జోకు ఏంటంటే.. సింగపూర్ లో చంద్రబాబు లేడుగా అంటున్నారు. సొంత పార్టీ వాళ్లు ప్రజాసమస్యలపై నిలదీసినా సహించే నాయకులు సింగపూర్ లో ఉన్నారు గానీ.. తనకు ఇష్టం లేకుండా ఒక్క మాట వినిపించినా సరే.. అసహనంతో రెచ్చిపోయే చంద్రబాబు నాయుడు వంటివారు అక్కడ ఉండరు కదా అనే వాదన వినిపిస్తోంది.

ఏదో జనాంతికంగా జనం దృష్టిలో మార్కులు కొట్టేయడానికి అన్నట్లుగా.. చంద్రబాబు ప్రజల సమస్యలను తన పార్టీ వారు ప్రస్తావించాలనే పడికట్టు పదాలు వాడుతున్నారు తప్ప.. నిజంగా వారు ప్రస్తావిస్తే సహించే ఉద్దేశం ఆయనకు ఉండదనేది పలువురి మాట. సాధారణంగా చంద్రబాబునాయుడు కేబినెట్ భేటీల్లోనే తాను సిద్ధం చేయించిన ప్రతిపాదనల మీద.. మంత్రులు ఎవరైనా అనుమానాలు వ్యక్తంచేసినా సరే.. వాటిని నివృత్తి చేయడానికి బదులు ఒంటికాలిపై లేస్తుంటారని ప్రతీతి. అలా తన ఇష్టానికి భిన్నంగా చిన్న మాట వినిపించినా.. మంత్రుల మీదనే విరుచుకుపడిపోయే చంద్రబాబునాయుడు... ఇక ఎమ్మెల్యేలు నిజమైన ప్రజాసమస్యలను ప్రస్తావిస్తే ఊరుకుంటారా? నిప్పులు తొక్కేయరూ..? అని పార్టీ వర్గాలే నవ్వుకుంటున్నాయి.

ఇలాంటి ఆదర్శాలు అన్నీ చెప్పుకోడానికి చాలా బాగుంటాయని.. కానీ ఆచరణలో తమ పద్ధతి తమకు ఎప్పటిలాగే ఉంటుందని వారంటున్నారు.
Tags:    

Similar News