చిన్ననోట్లకు భారీ కొరత.. ఎందుకిలా? కారణం ఎవరు?
దేశంలో చిన్ననోట్లకు విపరీతమైన కొరత ఏర్పడుతోంది.;
దేశంలో చిన్ననోట్లకు విపరీతమైన కొరత ఏర్పడుతోంది. డిజిటల్ పేమెంట్ల విధానం అంతకంతకూ పెరిగిన వేళ.. చిన్ననోట్ల వినియోగం తగ్గటం ఒక ఎత్తు అయితే.. వీటి విషయంలో రిజర్వు బ్యాంక్ అనుసరిస్తున్న తీరు కూడా తాజా పరిస్థితికి కారణమని చెబుతున్నారు. గతంలోకి చూస్తే.. గతంలో నాణెల వినియోగం ఉండేది. ఇప్పుడు చాలావరకు తగ్గిపోయింది. పేరుకు యాభై పైసలు చలామణిలో ఉన్నప్పటికి వాటిని వినియోగిస్తున్న వారే లేరు. ఇప్పుడు రూపాయి.. రెండు.. ఐదు.. పది రూపాయిల నాణెలు చలామణీలో ఉన్నాయి.
గడిచిన కొన్నేళ్లుగా డిజిటల్ పేమెంట్లు పెరిగిపోవటంతో చిరు వ్యాపారులు సైతం తమ స్కానర్లను అందుబాటులోకి తీసుకురావటంతో డబ్బుల చెల్లింపునకు పర్సు తీయటం మానేసి.. చేతిలో ఉన్న సెల్ ఫోన్ తో డబ్బులు చెల్లించే తీరు అంతకంతకూ పెరుగుతోంది. ఈ తీరుతో చిన్ననోట్ల ప్రింటింగ్ విషయంలో భారత రిజర్వు బ్యాంకు తీసుకున్న నిర్ణయం కూడా దేశంలో చిన్ననోట్ల కొరతకు కారణంగా చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో చిన్ననోట్లు (రూ.10, 20, 50) నోట్లకు భారీ కొరత ఏర్పడిన విషయాన్ని అఖిల భారత రిజర్వ్ బ్యాంక్ ఉద్యోగుల సంఘం పేర్కొన్న వైనం ఆసక్తికరంగా మారింది.
గ్రామీణ.. సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఈ చిన్ననోట్ల తీవ్రత సమస్య ఎక్కువగా ఉంది. దీంతో స్మార్ట్ ఫోన్ వినియోగించని వారికి.. బ్యాంకు ఖాతాలు ఏర్పాటు చేసుకోని చిరు వ్యాపారలు తీవ్ర సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆర్ బీఐ రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దాలని కోరుతున్నారు. బ్యాంక్ ఏటీంలోనూ రూ.100, రూ.200, రూ.500నోట్లు తప్పించి.. అంతకు తక్కువ విలువ ఉన్న నోట్ల రాని పరిస్థితి. ఈ తీరు మారాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది.
కొన్ని దశాబ్దాల క్రితం రూపాయి.. రెండు రూపాయిలతో పాటు రూ.5, రూ.10 నోట్లు అంతకు మించిన విలువైన నోట్లు చలామణీలో ఉండటం తెలిసిందే రూపాయి.. రెండు రూపాయిల నోట్లను అప్పుడెప్పుడో చిన్నప్పుడే ప్రింట్ చేయటం ఆపేశారు. ఇక.. రూ.5 నోటును 2005 నుంచి ప్రింట్ చేయటం నిలిపేశారు.దీనికి బదులుగా నాణెల్ని ప్రింట్ చేస్తున్నారు. నోటు విలువ కంటే దాని తయారీకి అయ్యే ఖర్చు ఎక్కువగా ఉండటం.. నాణెలు అయితే వాటి జీవిత కాలం చాలా ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని చెబుతన్నారు.
రూ.5 నోట్లను ప్రింట్ చేయనప్పటికీ లీగల్ గా చెల్లుబాటు అయ్యే పరిస్థితి. చిన్ననోట్ల ప్రింటింగ్ ను రిజర్వు బ్యాంక్ ఇండియా గణనీయంగా తగ్గించేసింది. ఉదాహరణకు పది రూపాయిల నోటును తీసుకుంటే 2017-18లో సుమారు 3వేల మిలియన్ నోట్లను ప్రింట్ చేస్తే.. 2021-22 నాటకి భారీగా తగ్గించేశారు. ప్రస్తుతం కూడా చాలా వరకు తగ్గించి.. నామమాత్రంగా మాత్రమే ప్రింట్ చేస్తున్న పరిస్థితి.
రూ.20 నోటు విషయానికి వస్తే 2017-18లో 2వేల మిలియన నోట్లను ముద్రిస్తే.. 2021-22 నాటికి అదే స్థాయిలో ప్రింట్ చేశారు. తాజాగా మాత్రం నోట్ల ప్రింటింగ్ తగ్గించిన పరిస్థితి. అదే సమయంలో రూ.50 నోటు విషయానికి వస్తే 2017-18 నాటికి సుమారు 2500 మిలియన్ నోట్లను ముద్రిస్తే.. 2021-22 నాటికి గణనీయంగా పెంచారు. తాజాగా కూడా ప్రింటింగ్ పెంచినా.. కొరతను ఎదుర్కోవటం గమనార్హం. చిన్ననోట్ల కొరత అంశానికి సంబంధించి ఆర్ బీఐ ప్రింటింగ్ ను ఎందుకు తగ్గించిందని చూసినప్పుడు ఆయా నోట్ల తయారీకి అయ్యే ఖర్చు పెద్దగా లేకున్నా.. త్వరగా పాడైపోవటం.. వాటి జీవితకాలం తగ్గిన తర్వాత.. వాటిని ఒకచోటుకు చేర్చి ప్రాసెస్ చేసే అంశంలో ఎదురయ్యే సమస్యలతోనే ప్రింటింగ్ తక్కువ చేసినట్లుగా చెబుతారు.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రూ.10 నోటు తయారీకి 96 పైసలు ఖర్చు అయితే. రూ.20 నోటు తయారీకి రూ.10నోటు కంటే తక్కువ ఖర్చు అంటే 95 పైసలకే తయారవుతుంది. ఇక.. రూ.50 నోటు విషయానికి వస్తే దీన్ని తయారీకి రూ.1.13 ఖర్చు అవుతుందని చెబుతున్నారు. అదే సమయంలో చిన్ననోట్ల జీవితకాలం తక్కువగా ఉండటం కూడా వీటి ముద్రణ విషయంలో ఆర్ బీఐ తక్కువ ఆసక్తి చూపుతున్నట్లుగా చెబుతున్నారు. ఒక లెక్క ప్రకారం రూ.10 నోటు జీవితకాలం తొమ్మిది నెలల నుంచి పది నెలలు మాత్రమే. చిన్ననోట్ల తరచూ చేతులు మారటం ద్వారా త్వరగా పాడయ్యే పరిస్థితి. అందుకే నోట్ల కంటే నాణెల్ని ఎక్కువగా ప్రోత్సహించేలా చేస్తున్నారు.