శశికళ ప్రాతినిథ్యం కోటిన్నరకా, ఏడు కోట్లకా?

Update: 2016-12-19 04:50 GMT
అమ్మ జయలలిత మరణానంతరం తమిళనాడు రాజకీయాలు ముఖ్యంగా అన్నాడీఎంకే రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. జయలలిత ఆస్పత్రిలో ఉన్నప్పడు, ఆమె మరణానంతరం కూడా అమ్మ వీర విధేయుడు పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి అయిన తర్వాత తాజాగా కొత్త మాటలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే పార్టీ పగ్గాలను చిన్నమ్మకు అప్పగించిన అన్నాడీఎంకే వర్గాలు.. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిని కూడా ఆమెకే కట్టబెట్టాలని చూస్తున్నాయట. ఈ క్రమంలో కొంతమంది సీనియర్ నాయకులు ఆమెను కలిసి ఇటు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవితో పాటు అటు ముఖ్యమంత్రి పదవిని కూడా చేపట్టాలని కోరారు.

అయితే జయలలిత మరణించిన కొద్ది రోజులకే ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, లోక్‌ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై సహా పలువురు సీనియర్ నాయకులు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టాల్సిందిగా చిన్నమ్మను కోరిన సంగతి తెలిసిందే. ఆ సంగతి అలా ఉంటే... ఈ విషయంలో అందరికీ షాకిస్తూ కొంతమంది సీనియర్ నాయకులు శశికళ ను సీఎం చేయాలని చూస్తున్నారట. ఈ మేరకు ఇప్పటికే చెన్నైలోని పలు ప్రాంతాల్లో శశికళ పేరు మీద పెద్దపెద్ద హోర్డింగులు కూడా వెలిశాయి! ఇందులో భాగంగా గతంలో జయలలిత ప్రాతినిధ్యం వహించిన ఆర్కే నగర్ నియోజకవర్గం నుంచి ఆమెను పోటీ చేయాలని కోరుతూ ఒక తీర్మానం కూడా ఆమోదించింది. అదేవిధంగా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టడం ద్వారా సుమారు కోటిన్నర మంది అన్నాడీఎంకే సభ్యులను, ముఖ్యమంత్రి పదవి చేపట్టడం ద్వారా దాదాపు ఏడు కోట్ల మంది తమిళ ప్రజలను కాపాడాల్సిందిగా చిన్నమ్మను కోరామని గృహనిర్మాణ శాఖ మంత్రి రాధాకృష్ణన్ చెబుతున్నారు. వీరితో పాటు వివిధ జిల్లాకు చెందిన పలువురు మంత్రులు, సీనియర్లూ కూడా ఇదే తరహా తీర్మానాలు చేసి, వాటి కాపీలను శశికళకు అందించారు. ఈ వ్యవహారం ఈ రేంజ్ లో సాగుతున్నా అన్నాడీఎంకేలోని ఏ ఒక్కరూ ఇంతవరకూ శశికళను బహిరంగంగా వ్యతిరేకించలేదు. పరిస్థితి చూస్తుంటే... రాబోయే రోజుల్లో చిన్నమ్మ ముఖ్యమంత్రి కావడం ఖాయంగానే కనిపిస్తోందని చెప్పుకోవచ్చు!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News