జనవరిలో చిన్నమ్మ రాక .. తమిళనాట మొదలైన కాక

Update: 2020-11-19 03:30 GMT
అక్రమాస్తుల కేసుల అరెస్టయి కర్ణాటకలోని జైల్లో శిక్ష అనుభవిస్తున్న జయ నెచ్చెలి శశికళ విడుదలకు మార్గం సుగమం అయ్యింది.  అక్రమాస్తుల కేసుల కోర్టు జయకు రూ.100 కోట్ల జరిమానా విధించగా శశికళ, ఇతరులకు మాత్రం రూ. 10 కోట్లు విధించింది. ఇప్పుడు ఆ రూ.10 కోట్లు శశికళ తరపు న్యాయవాదులు చెల్లించారు.శశికళ జనవరి 27న  జైలు నుంచి బయటకు రానున్నది. అయితే ఇప్పటికే ఆమె తనకు కోర్టుకు విధించిన రూ. 10.10 కోట్ల జరిమానా కూడా కోర్టుకు చెల్లించేశారు. దీంతో ఇక శశికళ రావడమే తరువాయి.అక్రమ ఆస్తుల కేసులో జయ లలిత, శశికళతో పాటు  ఆమె బంధువులకు సుప్రీంకోర్టు జైలుశిక్ష విధించింది.

2017 ఫిబ్రవరి 15 నుంచి శశికళ బెంగళూరు పరపన అగ్రహారం జైల్లో అనుభవిస్తున్నారు. అయితే  సత్ర్పవర్తన, పెరోల్​ను అధికంగా వినియోగించుకోకపో వడం తదితర కారణాలతో  శశికళ  జైలుశిక్ష తొందరగా పూర్తవుతున్నట్టు సమాచారం.

చిన్నమ్మ విడుదలపై క్లారిటీ

శశికళ  ఎప్పుడు విడుదల అవుతారనే విషయం తెలపాలని బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి సమాచారం  చట్టం కింద కర్ణాటక జైళ్ల శాఖకు దరఖాస్తు చేసుకున్నాడు. శశికళ డిసెంబర్​లోపు జరిమానా  విధిస్తే ఆమె జనవరి 27న విడుదలవుతారని జైలు అధికారులు అడిగిన విషయానికి  సమాధానం తెలియజేసారు.

ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం బెంగళూరు ప్రత్యేకకోర్టు న్యాయమూర్తి శివప్పా సమక్షంలో శశికళ తరఫు న్యాయవాది రూ. 10.10 కోట్ల జరిమానాను కోర్టుకు కట్టారు. దీంతో ఆమె విడుదలకు మార్గం సుగమమైంది.

అయితే శశికళ ఒక్కసారిగా రూ. 10.10 కోట్లు జరిమానాగా చెల్లిస్తుండటంతో ఆదాయపు పన్నుశాఖ ఆమె మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో శశికళ తరఫు న్యాయవాదులు పక్కా పత్రాలు, లెక్కలతో ఈ డబ్బును కోర్టుకు సమర్పించినట్టు సమాచారం. శశికళకు ఎవరెవరు డబ్బులు ఇచ్చారు. వారి బ్యాంకువివరాలు, ఆదాయవివరాలను కూడా ఎంతో పక్కాగా కోర్టుకు సమర్పించారు న్యాయవాదులు.. పళనివేళ్​ అనే వ్యక్తి స్టేట్​బ్యాంక్​ నుంచి రూ. 3.25 కోట్లు, వసంతదేవి అనే మహిళ రూ. 3.75 కోట్లు, హేమ అనే మహిళ  యాక్సిస్​ బ్యాంక్​ నుంచి రూ. 3 కోట్లు. వివేక్​ అనే వ్యక్తి రూ. 10వేలు డీడీల రూపంలో ఈ డబ్బును పంపించారు.  

అన్నా డీఎంకే పరిస్థితి ఏంటి

 సీఎం గా బాధ్యతలు చేపట్టాల్సిన సమయంలో అనూహ్యంగా శశికళ జైలు పాలయ్యారు. దీంతో పళని స్వామి సీఎం అయ్యారు. పన్నీర్ సెల్వం డిప్యూటీ సీఎం అయ్యారు. శశికళ తిరిగి వచ్చాక తిరిగి పార్టీని స్వాధీనం చేసుకుంటుందా లేదా అనేది త్వరలో తెలియాల్సి ఉంది. శశికళ ఎంట్రీతో  తమిళనాడు రాజకీయాల్లో ఏమేరకు మార్పులు చోటుచేసుకుంటాయన్న దానిపై ప్రస్తుతం జోరుగా చర్చ నడుస్తున్నది. జయలలిత మరణం తర్వాత శశికళే అన్నాడీఎంకేకు అధి నాయకురాలిగా  వ్యవహరిస్తారని.. ఆమె తమిళనాడు ముఖ్యమంత్రి అవుతారని అంతా భావించారు. కానీ కొన్ని నాటకీయ పరిణామాల మధ్య  పళనిస్వామి గద్దె నెక్కగా.. అవినీతి కేసులో ఇరుక్కొని శశికళ జైలుకు వెళ్లారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు శశికళ ఇప్పటికే కసరత్తు చేశారు. దీనికి సంబంధించి ఆమె తన న్యాయవాది రాజా చెందూర్‌ పాండియన్‌కు రాసిన లేఖ వెలుగు చూసింది. ఇందులో ఆమె ఇచ్చిన సూచన ఆధారంగా సుప్రీంకోర్టులో కేవియేట్‌ పిటిషన్‌ దాఖలుకు కసరత్తులు సాగుతుండడం గమనార్హం. ఈ సారి అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం పార్టీ తరపున శశికళ  అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులని నిలిపి  పోటీచేయనున్నట్టు తెలిసింది.నాలుగేళ్లు జైలు శిక్ష పడడంతో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం శశికళకు లేదు. దీంతో తనకు విధించిన శిక్షకు వ్యతిరేకంగా కేవియేట్‌ పిటిషన్‌ దాఖలుతో ఎన్నికల్లో పోటీ చేసేందుకు తగిన వ్యూహాలకు చిన్నమ్మ వ్యూహం పన్నుతున్నట్టు తెలిసింది.  

అక్రమాస్తుల కేసు విచారణ ఒకే కోణంలో జరిగినట్టు, అన్ని కోణాల్లో పరిశీలించి విచారణ జరగాలని, అలాగే, శిక్ష విషయంగా పునస్సమీక్షించేందుకు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసేందుకు వ్యూహరచన జరుగుతున్నట్టు సమాచారం. చిన్నమ్మ ప్రతినిధి దినకరన్, న్యాయవాది రాజాచెందూర్‌ పాండియన్‌ ఢిల్లీలోని న్యాయవాదులు, న్యాయప్రతినిధులతో సంప్రదింపులకు సిద్ధమవుతున్నారు. ఓ వైపు రజనీ పార్టీ పెట్టే యోచనలో ఉండగా, కమల్ ఇప్పటికే పార్టీ పెట్టాడు. ఇప్పుడు శశికళ కూడా ఎన్నికల్లో పోటీకి సమాయత్తం అవుతుండటంతో  ఎన్నికలు రోజుకో మలుపు తిరుగు తున్నాయి.
Tags:    

Similar News