సబ్బం వీరంగం దేనికి సంకేతం ? ఆక్రమణను ఒప్పుకున్నట్లేనా ?

Update: 2020-10-04 07:10 GMT
మెడలు విరిచేస్తా..అంతు తేలుస్తా... ఇది తాజాగా విశాఖపట్నం మాజీ మేయర్, మాజీ ఎంపి సబ్బంహరి చేసిన వీరంగం.  శనివారం ఉదయం సబ్బం ఇంటి కాంపౌండ్ వాల్ ను జీవిఎంసి ఉన్నతాధికారులు కూల్చేశారు.  మున్సిపాలిటికి చెందిన సుమారు 200 గజాల స్ధలాన్ని ఆక్రమించుకుని కాంపౌండ్ వాల్ కట్టేసుకున్నారనే ఆరోపణలు సబ్బంపై ఎప్పటి నుండో ఉన్నాయి. అయితే ఈమధ్య  ఎలక్ట్రిసిటీ కాలనీకి చెందిన కొందరు సబ్బంపై ఫిర్యాదులు చేసి పార్కు స్ధలాన్ని ఆక్రమించేసుకున్నారని చెప్పారు. దాంతో విషయంపై విచారణ జరిపిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సబ్బం ఆక్రమణ నిజమే అని తేల్చారు.

ఆక్రమణ విషయం తేలిపోవటంతో శనివారం ఉదయం జేసీబీలతో వచ్చిన ఉన్నతాధికారులు కాంపౌండ్ వాల్ ను కూల్చేశారు. పనిలో పనిగా స్వాధీనం చేసుకున్న స్ధలానికి ఫెన్సింగ్ కూడా వేసేసి మున్సిపల్ స్ధలమంటూ బోర్డు కూడా పెట్టేశారు. హఠాత్తుగా తనింటి కాంపౌండ్ వాల్ కూల్చేయటానికి మున్సిపల్ సిబ్బంది రావటాన్ని సబ్బం జీర్ణించుకోలేకపోయారు. దాంతో ఒక్కసారిగా వాళ్ళపై ఫుల్లుగా ఫైర్ అయ్యారు. నోటికొచ్చినట్లు మాట్లాడుతు వాళ్ళపై విరుచుకుపడ్డారు. జగన్మోహన్ రెడ్డితో పాటు విజయసాయిరెడ్డి అండ్ కో పై నోటికొచ్చినట్లు తిట్లదండకం అందుకున్నారు. వాడు వీడు అంటూ జగన్ పై విరుచుకుపడిన సబ్బంను చూసి అందరు ఆశ్చర్యపోయారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే  మామూలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై సబ్బం ఎప్పటి నుండో తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఎప్పుడు కూడా ఎవరినీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదు. అలాంటిది  జగన్ అండ్ కో ను సబ్బం నోటికొచ్చినట్లు మాట్లాడటం, దుర్బాషలాడటంతో అందరు ఆశ్చర్యపోయారు.   మున్సిపాలిటి పార్కు స్ధలాన్ని ఆక్రమించి  కాంపౌండ్ నిర్మాణం జరిగిందనే ఆరోపణలు తప్పయితే అదే విషయాన్ని చెప్పవచ్చు. తన వాదనకు ఆధారాలుగా తన దగ్గరున్న డాక్యుమెంట్లను చూపిస్తే సరిపోతుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుకెళ్ళే అవకాశం ఎలాగూ ఉంది. ఇదే సమయంలో ప్రభుత్వంపై నిరసన తెలిపే హక్కు కూడా సబ్బంకు ఉంది.

అయితే తనకున్న అవకాశాలను వదులుకుని జగన్ అండ్ కో పై నోటికొచ్చినట్లు విరుచుకుపడటం జనాలకు రాంగ్ సిగ్నల్ ఇచ్చేసింది. ప్రభుత్వ స్ధలాన్ని ఆక్రమించుకుని పబ్బం గడుపుకుంటున్నారు కాబట్టే సబ్బంకు ఇంత కోపం వచ్చిందనే చర్చ జరుగుతోంది.  ఇదే సమయంలో జీవిఎంసి ఉన్నతాధికారులు సబ్బం ఆక్రమణలను రికార్డులతో సహా వివరిస్తున్నారు. కాంపౌండ్ వాల్ ను కూల్చివేస్తున్నట్లు శుక్రవారం ఉదయం తామిచ్చిన నోటీసును తీసుకోవటానికి సబ్బం ఇష్టపడలేదని చెబుతున్నారు. అందుకనే ఆ నోటీసును సబ్బం ఇంటికి అంటిచేసినట్లు చెప్పారు. ఆక్రమిత స్ధలాలను స్వాధీనం చేసుకునేందుకు నిజానికి తాము నోటీసులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని జీవీఎంసి కమీషనర్ సృజన చెప్పారు. అయినా సబ్బంకు నోటిసిచ్చినట్లు చెప్పారు.

మొత్తం మీద కాంపౌండ్ వాల్ కూల్చేసిన ఘటనలో సబ్బం వ్యవహరించిన తీరునే అందరు తప్పు పడుతున్నారు. ఎందుకంటే మున్సిపల్ పార్కు స్ధలాన్ని సబ్బం ఆక్రమించుకుని కాంపౌండ్ వాల్ కట్టేసుకున్నాడనే ఆరోపణలు ఇప్పటివి కావు. ఎప్పటి నుండో ఆరోపణలు, ఫిర్యాదులున్నా ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. సబ్బం మేయర్, ఎంపిగా పదేళ్ళుండటం తర్వాత రాష్ట్ర విభజన ఉద్యమాలు, తర్వాత టీడీపీ అధికారంలోకి రావటంతో సబ్బం జోలికి ఎవరు వెళ్ళలేదు. కానీ ప్రస్తుతం సీన్ రివర్సులో నడుస్తుండటంతో మున్సిపల్ అధికారుల దృష్టి సబ్బం ఆక్రమణపై పడింది. వెంటనే యాక్షన్ కూడా జరిగిపోయింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో గమనించాల్సిందేమంటే  కాంపౌండ్ వాల్ కూల్చేసిన ఘటనపై తాను కోర్టుకెళ్ళే ఆలోచన చేయటం లేదని సబ్బం ప్రకటించటం. ప్రభుత్వందే తప్పయితే సబ్బం కోర్టులో కేసు వేయనని ఎందుకు చెప్పినట్లు ?
Tags:    

Similar News