అదృష్టదేవత గులాబీ పార్టీ వైపే ఉందే!
గెలుపు వరకు వెళ్లారు. కానీ.. ప్రత్యర్థికి కూడా తమకు వచ్చిన ఓట్లే రావటంతో.. అధికారులు టాస్ ద్వారా విజేతను తేలుస్తామన్నారు.;
అన్ని హంగులు ఉండొచ్చు. ప్రజాదరణకు లోటు లేదు. కానీ.. అదృష్టదేవత మాత్రం వెంట లేదు. అప్పుడేమవుతుంది అంటే? తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నిక ఫలితాల్లో ముగ్గురు అభ్యర్థులకు ఎదురైన చేదు అనుభవమే మిగులుతుంది. ప్రజలు ఓట్లేశారు. గెలుపు వరకు వెళ్లారు. కానీ.. ప్రత్యర్థికి కూడా తమకు వచ్చిన ఓట్లే రావటంతో.. అధికారులు టాస్ ద్వారా విజేతను తేలుస్తామన్నారు. ఆ టాస్ పూర్తిగా అదృష్టం మీదనే ఆధారపడి ఉంటుంది. దీంతో.. ప్రజాదరణతో ఓట్లు పొందినా.. అదృష్టదేవత వెంట లేకపోవటంతో ఓటమిపాలు కావాల్సి వచ్చింది.
తమకు వచ్చినన్ని ఓట్లు వచ్చిన వ్యక్తి విజేతగా నిలిచిన విచిత్రమైన పరిస్థితి కొన్ని చోట్ల చోటుచేసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా 2500పైచిలుకు వార్డులకు ఎన్నికలు జరిగితే.. కేవలం మూడు నాలుగు చోట్ల మాత్రం.. బరిలో ఉన్న ఇద్దరు అభ్యర్థులకు సరి సమానంగా ఓట్లు వచ్చిన పరిస్థితి. దీంతో.. విజేతను డిసైడ్ చేసేందుకు ఎన్నికల అధికారులు టాస్ పద్దతిని అనుసరించారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. మూడు చోట్లా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే విజేతలుగా నిలిచారు. ఇదంతా చూసిన వారు.. ప్రజాదరణ లేకున్నా అదృష్టదేవత ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయన్న మాట పలువురి నోట వినిపించే పరిస్థితి.
దుబ్బాక మున్సిపాలిటీలోని మూడో వార్డులో బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఓట్ల లెక్కింపు వేళ.. ఇద్దరు అభ్యర్థులకు సమానమైన ఓట్లు వచ్చిన పరిస్థితి. దీంతో.. కాయిన్ టాస్ ద్వారా విజేతను తేల్చే ప్రక్రియను చేపట్టారు అధికారులు. ఇందులో బీఆర్ఎస్ అభ్యర్థి విజేతగా నిలవటంతో.. బీజేపీ అభ్యర్థి వేదన అంతా ఇంతా కాదు. ఇదే తీరులో నర్సాపూర్ మున్సిపాలిటీలోనూ ఇలాంటి సీనే చోటు చేసుకుంది. పటాన్ చెర్వు నియోజకవర్గం పరిధిలోని ఇంద్రేశం మున్సిపాలిటీలోనూ బీఆర్ఎస్ అభ్యర్థి లావణ్య లాటరీలో విజేతగా నిలిచారు. ఇలా లాటరీ ద్వారా విజేతను తేల్చే ఉదంతాల్లో అత్యధికం బీఆర్ఎస్ అభ్యర్థులే విజేతలుగా నిలిచారు.
ఇందుకు భిన్నంగా రెండుచోట్ల ఫలితం వచ్చింది. ఒకచోట బీజేపీ అభ్యర్థి లాటరీలో విజయం సాధిస్తే.. మరోచోట ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. కామారెడ్డి మున్సిపాలిటీలో బీజేపీ అభ్యర్థి లక్ష్మారెడ్డికి, బీఆర్ఎస్ అభ్యర్థికి సమానంగా ఓట్లు రాగా.. లాటరీలో బీజేపీ అభ్యర్థి విజేతగా నిలిచారు. తూప్రాన్ లో మాత్రం ఇండిపెండెంట్ అభ్యర్థి లాటరీలో విజేతగా నిలిచారు. ఇదంతా చూస్తే.. అదృష్టదేవత అండ బీఆర్ఎస్ కు పుష్కలంగా ఉందని చెప్పక తప్పదు.