అభివృద్ధి, సంక్షేమాల మేళవింపు.. రూ.3.32 లక్షల కోట్లతో ఏపీ పద్దు
ఈ బడ్జెట్ లో అన్నిరంగాలకు సమ ప్రాధాన్యమిస్తున్నట్లు ప్రకటించారు. అటు శ్రీకాకుళం నుంచి ఇటు నెల్లూరు వరకు ప్రతి జిల్లా అవసరాలకు తగ్గట్లు కేటాయింపులు ఉన్నట్లు వెల్లడించారు.;
ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ ఏడాది భారీ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో రూ.3,32,205 కోట్లతో బడ్జెట్ పద్దులను రూపొందించారు. మొత్తం బడ్జెట్లో రూ.2,56,143 కోట్ల ఆదాయ వ్యయంగా చూపారు. రూ.53,915 కోట్లను మూలధన వ్యయంగా ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయ లోటు రూ.22 వేల కోట్లుగా చూపారు. అదేసమయంలో ఆర్థిక లోటు రూ.75 వేల కోట్లకు పెరుగుతున్నట్లు వెల్లడించారు. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు రాజధాని అమరావతిలో నిర్మించిన టీటీడీ ఆలయాన్ని కేశవ్ సందర్శించారు. బడ్జెట్ ప్రతులను శ్రీవారి పాదాల చెంత ఉంచి పూజలు చేశారు.
అనంతరం అసెంబ్లీకి చేరుకున్న ఆర్థిక మంత్రి కేశవ్ సరిగ్గా 11.20 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అటు మండలిలో హోం మంత్రి అనిత బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. కాగా, స్వర్ణాంధ్ర-2047 లక్ష్యంగా ఈ ఏడాది బడ్జెట్ ను ప్రవేశపెట్టినట్లు ఆర్థిక మంత్రి కేశవ్ అసెంబ్లీలో ప్రకటించారు. వరుసగా మూడో బడ్జెట్ ను పెట్టడంపై ఆనందం వ్యక్తం చేశారు. బడ్జెట్ అంటే జమా, ఖర్చుల లెక్క మాత్రమే కాదని వ్యాఖ్యానించారు ఆర్థిక మంత్రి. ‘‘మా దృష్టిలో బడ్జెట్ అంటే కేవలం పద్దుల ప్రకటన కాదు. ఇది అంకెలకు అతీతం. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని జోడెద్దుల బండిలా పరిగెత్తించాలన్న దృఢ సంకల్పాన్ని బలంగా చాటి చెప్పే ఒక ప్రకటన’’ అంటూ అభివర్ణించారు.
ఈ బడ్జెట్ లో అన్నిరంగాలకు సమ ప్రాధాన్యమిస్తున్నట్లు ప్రకటించారు. అటు శ్రీకాకుళం నుంచి ఇటు నెల్లూరు వరకు ప్రతి జిల్లా అవసరాలకు తగ్గట్లు కేటాయింపులు ఉన్నట్లు వెల్లడించారు. మహిళా పారిశ్రామికవేత్తల్లో స్ఫూర్తిని నింపేలా బడ్జెట్ రూపొందించామని, ప్రతి రూపాయి రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షులను సాకారం చేసేందుకు ఉపయోగిస్తామని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో గత ప్రభుత్వ పాలనపై ఘాటు వ్యాఖ్యలు, పదునైన విమర్శలు చేశారు ఆర్థిక మంత్రి. నాటి పాలనలో రాష్ట్రం విధ్వంసానికి గురైందని ఆరోపించారు. ఆ గాయాలను సరిదిద్దేందుకు రెండేళ్ల సమయం చాలా తక్కువ అని అన్నారు.
గత ప్రభుత్వ దుష్పరిపాలన వల్ల రాష్ట్రానికి భారీ నష్టం జరిగిందని ఆర్థిక మంత్రి కేశవ్ ఆరోపించారు. ఐదేళ్ల విషాదాన్ని దాటుకుని రాష్ట్రాన్ని పునర్నిర్మాణం దిశగా నడిపించేందుకు 2024లో పునాది వేయగా, 2025 బడ్జెట్ స్వర్ణాంధ్ర-2047 లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిందని పేర్కొన్నారు. 2014లో అహేతుక విభజన రాష్ట్రానికి తొలి దెబ్బ అయితే, 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం దుష్పరిపాలన రాష్ట్రానికి తగిలిన పెద్ద షాక్ అంటూ ఆర్థిక మంత్రి కేశవ్ పదునైన విమర్శలు చేశారు. ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూ కూటమి ప్రభుత్వం అనుసరించిన నిర్మాణాత్మకమైన విధానాల వల్ల 2024 జూన్ నుంచి కేవలం 20 నెలల పాలనలో రాష్ట్రం అద్భుతమైన అభివృద్ధి పథంలో పయనిస్తుందని, ఇది తనకెంతో గర్వకారణమని వ్యాఖ్యానించారు.