వీరిని ఎవరు కని ఎలా పెంచుతున్నారు? కంగ‌న వ్యాఖ్య‌ల‌పై జెన్‌-Z ఫైరింగ్!

బాలీవుడ్ లో దిగ్గ‌జ ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు కంగ‌న వ్య‌తిరేకిగా మారింది. ప‌లువురు స్టార్ హీరోలు, దర్శ‌క‌నిర్మాత‌ల‌తో వైరం పెంచుకోవ‌డంతో ఇండ‌స్ట్రీలో చాలా వ్య‌తిరేక‌త నెల‌కొంది.

Update: 2026-07-28 13:17 GMT

బాలీవుడ్ లో దిగ్గ‌జ ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు కంగ‌న వ్య‌తిరేకిగా మారింది. ప‌లువురు స్టార్ హీరోలు, దర్శ‌క‌నిర్మాత‌ల‌తో వైరం పెంచుకోవ‌డంతో ఇండ‌స్ట్రీలో చాలా వ్య‌తిరేక‌త నెల‌కొంది. ఇక రాజ‌కీయాల‌తో అంట‌కాగుతూ భాజ‌పా వ్య‌తిరేకులంద‌రితోను యుద్ధం చేస్తోంది. ఇంత‌కుముందు భాజ‌పాకు అనుకూలంగా ఉండ‌టంతో పంజాబీ రైతులంద‌రికీ వ్య‌తిరేకిగా మారింది. ఇప్పుడు ఏకంగా దేశంలోని జెన్ -జెడ్ యూత్ కి కూడా వ్య‌తిరేకిగా మారిపోయే వ్యాఖ్య‌లు చేసింది.

బాలీవుడ్ నటి, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన బిజేపి ఎంపీ కంగనా రనౌత్ మరోసారి విద్వేషపూరిత వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఇటీవల నీట్-యుజి పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ, అక్రమాలకు నిరసనగా `కాక్రోచ్ జనతా పార్టీ` (CJP) ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వేలాది మంది విద్యార్థులు, `జెన్ జెడ్` యువత ఆందోళనలు చేపట్టారు. విద్యార్థుల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించి.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో శనివారం ఈ నిరసనలు ముగిశాయి. అయితే ఈ ఆందోళనలకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు, రీల్స్‌పై కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులను, ముఖ్యంగా `యువ హిందూ మహిళలను` లక్ష్యంగా చేసుకుంటూ కంగనా వరుస పోస్ట్‌లు చేశారు. నిరసనకారుల రీల్స్ .. వారు వాడిన భాష `వాంతి` వచ్చేలా ఉందని అభివర్ణించారు. ఆందోళనల దృశ్యాల్లోని ప్రతీ ఫ్రేమ్‌లో అశ్లీలత, వికారం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని విమర్శించారు. నా జీవితంలో ఒక్క చోట ఇంతటి వికారమైన వాతావరణాన్ని ఎప్పుడూ చూడలేదు.. అసలు వీరిని ఎవరు కని, ఎలా పెంచుతున్నారు? అని సంచలన వ్యాఖ్యలు చేశారు. రోడ్లపై ప్రజల చేత దెబ్బలు తింటున్న ఆందోళనకారులను ఉద్దేశిస్తూ.. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే... ప్రజలు మిమ్మల్ని ధ్వంసం చేస్తారని హెచ్చరించారు. నిరసనకారులు తమ కూటమికి `కాక్రోచ్ జనతా పార్టీ` అని పేరు పెట్టుకోవడంపై కూడా ఆమె ఘాటుగా స్పందించారు.

ప్రస్తుతం కంగ‌న వ్యాఖ్య‌లు ఇంటర్నెట్‌లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి విద్యార్థులు చేసిన నినాదాలు, వాడిన బాషపై కంగ‌న దూషించిన తీరు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కంగనా చేసిన ఈ సంచలన వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వర్గం నెటిజన్లు కంగనా వ్యాఖ్యలకు పూర్తి మద్దతు తెలుపుతున్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉన్నా అసభ్యకరమైన పదజాలం, బూతులు వాడటం సంస్కృతి కాదని... అలాంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్య నిరసనల ప్రాధాన్యతను దిగజారుస్తాయని వారు అభిప్రాయపడుతున్నారు. యువతకు కనీస నైతిక విలువలు, క్రమశిక్షణ అవసరమని పలువురు యూజర్లు కంగనాకు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు.

మరోవైపు కంగనా ధోరణిని తీవ్రంగా తప్పుబడుతున్న వారి సంఖ్య కూడా తక్కువేమీ లేదు. విద్యార్థులు కొన్ని ఏళ్లుగా పేపర్ లీకేజీలు, పరీక్షల్లో అక్రమాలపై పోరాటం చేస్తున్నారని...విద్యార్థుల ఆగ్రహం వెనుక ఉన్న అసలు సమస్యను పక్కదారి పట్టించేలా ఎంపీ మాట్లాడటం సరికాదని విమర్శకులు మండిపడుతున్నారు. నిరసనల్లో తీవ్రమైన ఒత్తిడి, ఆవేదన వల్ల విద్యార్థులు ప్రతిస్పందించారని.... వారి సమస్యలను పరిష్కరించడం వదిలేసి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమని కొందరు సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు.

గతంలో సినీ కెరీర్‌లో ఎన్నో వివాదాలు... తిరుగుబాటు ధోరణితో వార్తల్లో నిలిచిన కంగనా ఇప్పుడు ఇతరుల ప్రవర్తనను ప్రశ్నించడంపై కొందరు `హైపోక్రసీ` (ద్వంద్వ నీతి) అని విమర్శిస్తున్నారు. గతంలో తాను సమాజ నిబంధనలను సవాలు చేసినప్పుడు అది సరైనదని సమర్థించుకుని...ఇప్పుడు విద్యార్థులు తమ హక్కుల కోసం వీధిలోకి వస్తే వారిని తప్పుబట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే నాయకులు... విద్యార్థినుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని వ్యాఖ్యానిస్తున్నారు.

ఏది ఏమైనా నీట్ ఆందోళనలు తీవ్రమై చివరకు విద్యాశాఖ మంత్రి రాజీనామా వరకు వెళ్లిన ఈ వ్యవహారంలో ప్రజా ఉద్యమాల ప్రభావం ఎంత ఉందో స్పష్టమైంది. దేశానికి చట్టాలు, మార్పులు తీసుకురావడంలో ప్రజాస్వామ్య నిరసనల పాత్రను కొట్టిపారేయలేమని.. అదే సమయంలో నిరసన తెలిపే విధానం.. దానిపై పాలకులు, నాయకులు స్పందించే తీరుపై కూడా బాధ్యత ఉండాలని ఈ వివాదం మరోసారి స్పష్టం చేస్తోంది.

Tags:    

Similar News