టీడీపీలో టికెట్ల ర‌చ్చ‌.. ఎంపీ కేశినేని ఘాటు వ్యాఖ్య‌లు.. తాగుబోతులు అంటూ కౌంట‌ర్‌!

Update: 2021-02-28 09:07 GMT
మునిసిప‌ల్ ఎన్నిక‌ల వేళ తెలుగుదేశం పార్టీలో విభేదాలు బ‌జారున ప‌డ్డాయి. విజ‌య‌వాడ‌లో ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌లు రోడ్డెక్కి పంచాయితీ పెట్టుకున్నారు. 34వ డివిజన్‌లో టీడీపీ సీనియర్‌ నాయకుడు కొట్టేటి హనుమంతరావు భార్య కొట్టేటి రమణికి మొదట బీ–ఫాం ఇచ్చి, ఆ తరువాత నిరాక‌రించారు. దీంతో.. ఆయన వర్గం తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేసింది.

ఈ క్ర‌మంలో శనివారం ఆయ‌న వ‌ర్గీయులు ఆందోళ‌న‌కు సిద్ధ‌మ‌య్యారు. కేదారేశ్వరపేట నుంచి ర్యాలీగా వెళ్లి పాత బస్టాండ్‌ వద్ద ఉన్న ఎంపీ కేశినేని నానీ పార్టీ కార్యాలయం ఎదుట ఆందోళ‌న చేపట్టారు. అయితే.. ఈ సంద‌ర్భంగా కేశినేని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. టికెట్ల కేటాయింపులో అదిష్టానానిదే తుది నిర్ణయమని, ఎవరైనా పార్టీ ఆదేశాలను పాటించాల్సిందేనని కొట్టేటి హనుమంతరావును హెచ్చరించారు.

అంతేకాకుండా.. ఇప్పటికే పార్టీ ఐదుసార్లు కార్పొరేటర్‌గా పోటీ చేసేందుకు పార్టీ అవకాశం ఇచ్చిందని, ఇప్పుడు.. ముసలి, ముతకలకు అవకాశం లేదంటూ హనుమంతరావును ఉద్దేశించి ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఇంత‌టితో ఆగ‌కుండా.. హద్దుమీరి ప్రవర్తిస్తే తోకలు కత్తిరిస్తానని, గుండారపు హరిబాబుకు పట్టిన గతే మీకూ పడుతుందని హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం.

కేశినేని తీరుపై కొట్టేటి హనుమంతరావు కుమార్తె కొట్టేటి శిరీష ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. టీడీపీలో 40 ఏళ్లుగా ఉంటూ పని చేసిన తన తండ్రికి పార్టీ అన్యాయం చేసిందని అన్నారు. తాగుబోతులకు, రౌడీషీటర్లకు టికెట్లు కట్టబెట్టి.. నమ్మకమైన పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నార‌ని మండిపడ్డారు.

ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి వంద శాతం ఉత్తమమైన వ్యక్తని, నమ్ముకున్న వాళ్లకు సహాయం చేస్తారని అన్నారు. టీడీపీలో ఆ పద్ధతి లేదని, తాము ఇండిపెండెంట్‌గా పోటీచేసి గెలిచి వైఎస్సార్‌సీపీలో చేరి తీరుతామని ప్ర‌క‌టించ‌డం విశేషం.
Tags:    

Similar News