అమరావతిపై తీర్మానం.. వైసీపీపై స్పీకర్ అయ్యన్నసంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు నిర్ణయంపై నమ్మకంతో అమరావతి రైతులు తమ భూములను స్వచ్ఛందంగా ఇచ్చి సహకరించారని, 2014-19 మధ్య పనులు శరవేగంగా జరిగాయని చెప్పారు.;
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రాజధాని అమరావతిపై చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టే ముందు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ తీర్మానం ఐదున్నర కోట్ల మంది ఆంధ్రుల ఆకాంక్షలకు ప్రతిరూపమని స్పీకర్ అయ్యన్న అభివర్ణించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో చోటుచేసుకున్న అనేక అంశాలను ఎండగట్టేలా స్పీకర్ విమర్శలు గుప్పించారు. కనీసం ఈ రోజైనా ఆ 11 మంది సభకు హాజరు అవుతానని ఆశించానని వ్యాఖ్యానించారు. సభకు హాజరుకాని విపక్ష వైసీపీ సభ్యులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రగతికి ఎదురయ్యే సవాళ్లను శాశ్వతంగా తొలగించేలా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడాన్ని ఒక పవిత్ర యజ్ఞంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు అభివర్ణంచారు. ఈ చారిత్రాత్మక సందర్భంలో తాను భాగస్వామి కావడం అదృష్టంగా భావిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. 2014లో విడిపోయిన రాష్ట్రాన్ని గట్టెక్కించే బాధ్యతను ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అప్పగించారని, ఆయన తన అపార అనుభవంతో అందరినీ సంప్రదించి, రాష్ట్రానికి కేంద్ర బిందువుగా ఉన్న అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారని గుర్తుచేశారు.
చంద్రబాబు నిర్ణయంపై నమ్మకంతో అమరావతి రైతులు తమ భూములను స్వచ్ఛందంగా ఇచ్చి సహకరించారని, 2014-19 మధ్య పనులు శరవేగంగా జరిగాయని చెప్పారు.దురదృష్టవశాత్తూ 2019లో ప్రగతి రథానికి అడ్డంకులు ఎదురయ్యాయని, 2019-24 మధ్య కనివినీ ఎరుగని రీతిలో వైపరీత్యాలతో కూడిన పాలన సాగిందని స్పీకర్ మండిపడ్డారు.ఇదే సందర్భంలో సభకు గైర్హాజరైన 11 మంది వైసీపీ సభ్యుల వైఖరిని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తప్పుబట్టారు. "కనీసం ఈ రోజైనా ఆ 11 మంది సభ్యులు సభకు వస్తారని భావించాను. అమరావతి తీర్మానాన్ని బలపరిచి, గతంలో తాము చేసిన తప్పులపై పశ్చాత్తాపం చెందుతారని ఆశించాను. కానీ చేసిన తప్పులను ధైర్యంగా ఒప్పుకునే నిజాయితీ వారికి లేదని అర్థమైంది. ఇది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను." అంటూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు వైసీపీ ఎమ్మెల్యేలపై మండిపడ్డారు.
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారడం సహజమని, కానీ పరిపాలన అనేది నిరంతర ప్రక్రియ అని స్పీకర్ అయ్యన్నపాత్రుడు హితవు పలికారు. ప్రభుత్వాలు మారినప్పుడు పాత పనులు కొనసాగిస్తూ కొత్తవి చేపట్టాలని, కానీ గత పాలకులు తమ చేతికి కొబ్బరి కాయ దొరికినట్టుగా ఇష్టానుసారం వ్యవహరించారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విధ్వంసానికి కంకణం కట్టుకోవడం వల్ల ఏపీ అభివృద్ధిలో 50 ఏళ్లు వెనక్కి వెళ్లిందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు వీధినపడి అవమానాల పాలయ్యారని గుర్తుచేశారు.
శిలాక్షరాల్లో నిలిచిపోయేలా 'అమరావతి'
ఇలాంటి వినాశకర పరిస్థితులు మళ్లీ రాకూడదనే ఉద్దేశంతోనే, అమరావతిని శాశ్వత రాజధానిగా శిలాక్షరాల్లో లిఖించాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయించిందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు దృఢ సంకల్పం వల్లే కేంద్ర ప్రభుత్వం సైతం రాష్ట్ర విభజన చట్టంలో మార్పులు తెచ్చేందుకు అంగీకరించిందని వెల్లడించారు. ఈ తీర్మానం రాష్ట్ర అభివృద్ధి పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని స్పీకర్ అయ్యన్నపాత్రుడు కొనియాడారు.