అమరావతిపై షర్మిల ట్వీట్.. ‘మళ్లీ జగన్ లాంటి వాళ్లు వస్తే..?’

రాజధానిగా అమరావతి చట్టబద్ధతను పటిష్టం చేసే దిశగా అసెంబ్లీలో తీర్మానం చేయడంపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు.;

Update: 2026-03-28 07:39 GMT

రాజధానిగా అమరావతి చట్టబద్ధతను పటిష్టం చేసే దిశగా అసెంబ్లీలో తీర్మానం చేయడంపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాలనే కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే, విభజన చట్టంలోని కీలక హామీలను కేంద్రం నుంచి రాబట్టడంలో ప్రభుత్వం విఫమలవుతోందని విమర్శనాస్త్రాలు సంధించారు. కేంద్రం ఇచ్చేది 'ముష్టి' కాదు.. అది ఏపీ ప్రజల 'హక్కు' అంటూ షర్మిల తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఇక తన సోదరుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ పై షర్మిల వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుచూపును కొనియాడుతూనే ‘మళ్లీ జగన్ లాంటి వాళ్లు వస్తే’ అంటూ షర్మిల వ్యాఖ్యానించడం రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది.

రాజధాని మార్పు వంటి నిర్ణయాలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా సెక్షన్ 5 సవరణకు కేంద్రాన్ని కోరడం మంచి పరిణామమని షర్మిల తన ట్వీట్ లో అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగానే ‘మళ్లీ ఏ జగన్ వంటి వారు వస్తే రాజధాని పరిస్థితి ఏంటన్న ముందుచూపు ఉండటం మీ విజన్ అనుకుందాం.. కానీ కేవలం గెజిట్‌లో పేరు మార్పుతోనే అమరావతి నిర్మాణం పూర్తవుతుందా?" అని ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ప్రశ్నించారు. ప్రధానంగా 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలను ప్రస్తావిస్తూ ఆమె ఘాటైన ప్రశ్నలు వేశారు.

కొత్త రాజధానిలో రాజ్‌భవన్, హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ వంటి రాజ్యాంగబద్ధమైన భవనాల నిర్మాణానికి కేంద్రమే పూర్తి నిధులు ఇవ్వాలని సెక్షన్ 94(3) స్పష్టం చేస్తోంది. దీనిపై అసెంబ్లీలో తీర్మానం ఎందుకు చేయడం లేదు? అంటూ షర్మిల తన ట్వీట్ లో నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అరకొర నిధులతో సరిపెట్టుకుందామా? లక్ష కోట్ల రూపాయల భారాన్ని ప్రజల నెత్తిపై వేస్తారా? అని ఆమె నిలదీశారు. గతంలో ప్రధాని మోదీ రాజధాని శంకుస్థాపన సమయంలో ఇచ్చిన 'చెంబుడు నీళ్లు, తట్టెడు మట్టి'నే గొప్ప ప్రసాదంగా భావిద్దామా అని షర్మిల ఎద్దేవా చేశారు.

గెజిట్ పత్రాల సాక్షిగా.. కేంద్రానిదే బాధ్యత

విభజన చట్టం గెజిట్ (నెం. 6, మార్చి 1, 2014) ప్రకారం, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బాధ్యత కేంద్రానిదే. ముఖ్యంగా సెక్షన్ 94(3) కింద ఆర్థిక సహాయం అందించడం కేంద్రం చట్టబద్ధమైన బాధ్యత అంటూ షర్మిల వ్యాఖ్యానించారు. అమరావతిని కేవలం కాగితాల మీద రాజధానిగా స్థిరీకరించడం కంటే, కేంద్రం నుంచి రావాల్సిన నిధులను హక్కుగా సాధించుకోవడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని షర్మిల డిమాండ్ చేశారు. కేంద్రం విభజన చట్టానికి తూట్లు పొడుస్తుంటే అసెంబ్లీ వేదికగా ఎందుకు మౌనంగా ఉంటున్నారని, అప్పులు ఇప్పిస్తే చాలని రాజీ పడటం రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతమని ఆమె హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తరపున తాము సంధిస్తున్న ఈ ప్రశ్నలకు కూటమి ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు.

Tags:    

Similar News