ఫలక్ నుమా ప్యాలెస్ లో రిసెప్షన్.. అదే వేళ ఆ సంపన్నుడి ఇంట్లో?

Update: 2020-08-04 04:15 GMT
హైదరాబాద్ మహానగరంలోని ఒక సంపన్నుడి ఇంట్లో జరిగిన చోరీ షాకింగ్ గా మారింది. ఇంట్లో పనికి పెట్టుకునే వారి విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని తాజా ఉదంతం స్పష్టం చేస్తుందని చెప్పాలి. దాదాపు రూ.2కోట్లకు పైనే చోరీ జరిగిన ఈ ఉదంతంలోకి వెళితే.. మేడ్చల్ జిల్లా కుషాయిగూడలోని సైనిక్ పురిలో నర్సింహా రెడ్డి అనే వ్యాపారి కుటుంబం నివాసం ఉంటుంది. అతడి కుమారుడి పెళ్లి రిసెప్షన్ ఆదివారం రాత్రి ఫలక్ నుమా ప్యాలెస్ లో ఘనంగా జరిగింది.

బంధువులతో కలిసి హోటల్ కు సాయంత్రం ఐదు గంటల వేళలో బయలుదేరారు. వేడుకను అనుకున్నట్లుగా పూర్తి చేసుకొని ఆనందంగా ఇంటికి వచ్చిన వారికి దిమ్మ తిరిగిపోయే షాక్ తగిలింది. ఇంటికి వచ్చేసరికి తలుపులు తెరిచి ఉండటం.. ఇంట్లోని నాలుగు బీరువాలు ధ్వంసమై.. వస్తువులు చెల్లాచెదరుగా పడి ఉండటమే కాదు.. విలువైన బంగారు ఆభరణాలు.. నగదు పోయిన వైనాన్ని గుర్తించారు.

దీంతో షాక్ తిన్న ఆ కుటుంబం ఇంట్లోని సీసీ కెమేరా పుటేజ్ ను పరిశీలించారు. ఇంటి పని మనిషి.. ఆమె భర్తతో పాటు మరొకరి సాయంతో భారీ చోరీ చేసినట్లు గుర్తించారు. పని మనిషి ఫోన్ నెంబరు ఆధారంగా వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఏడు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి చోరీకి పాల్పడిన వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యల్ని చేపట్టారు. నిందితులు వినియోగించిన బైకును సైనిక్ పురి ప్రాంతంలో గుర్తించారు. ఇంట్లో పనికి పెట్టుకునే సమయంలో.. వారి వివరాల్ని జాగ్రత్తగా సేకరించిన తర్వాతే పనిలోకి చేర్చుకోవాలని చెబుతున్నారు.
Tags:    

Similar News