చంద్రబాబు ఉంటే ఎంత పోతే ఎంత: రోజా

Update: 2016-11-19 10:24 GMT
కర్నూలు జిల్లాలో ఇంజినీరింగ్ కాలేజి విద్యార్థిని ఉషారాణి ఆత్మహత్యపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం తీరును ఆమె దుయ్యబట్టారు. లెక్చరర్ - సీనియర్ల వేధింపుల భరించలేక విద్యార్థిని ఉషారాణి ఆత్మహత్య చేసుకుందని... ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తోందని... ఇంత జరుగుతున్నా విద్యాశాఖ మంత్రి విదేశాల్లో విహరిస్తున్నారని ఆమె ఆరోపించారు.

సీఎం చంద్రబాబుపైనా ఆమె పదునైన విమర్శలు చేశారు. చంద్రబాబుకు ఆడపిల్లలు లేరు కాబట్టి అమ్మాయిల విలువ తెలియడం లేదని ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు కూడా ఆడ పిల్లలు ఉండి ఉంటే… అప్పటి వరకు గుండెల్లో పెట్టుకుని పెంచుకున్న ఆడబిడ్డ హఠాత్తుగా మాయమైపోతే ఆ బాధ ఏంటో అర్థమయ్యేదన్నారు. ఆడ బిడ్డలను కాపాడలేని ముఖ్యమంత్రి ఉంటే ఎంత పోతే ఎంత అని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు చూసి ఆయన భార్య భువనేశ్వరి కూడా సిగ్గుతో తలదించుకోవాలన్నారు.

ఆడపిల్లలపై ఎవరైనా దాడి చేస్తే పది నిమిషాల్లో వచ్చి తాట తీస్తానని ఎన్నికల సమయంలో చెప్పిన చంద్రబాబు ఇప్పటి వరకు ఎవరి తాట తీశారని ప్రశ్నించారు. నారాయణ కాలేజీలో 21 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే మంత్రి నారాయణ తాటను ఎందుకు తీయలేదని రోజా ప్రశ్నించారు. రిషితేశ్వరి కేసులో ప్రిన్సిపల్ బాబురావును వెనుకేసుకొచ్చి దూళిపాళ్ల - దేవినేని తాట తీసి ఉంటే ఇప్పుడు ఉషారాణి చనిపోయేది కాదన్నారు. తహసీల్దార్ వనజాక్షిపై దాడి చేసినప్పుడు ఎమ్మెల్యే చింతమనేని తాట తీసి ఉంటే ఆ తర్వాత మహిళలపై దాడులు జరిగేవి కాదన్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాస్‌ కు విద్యాశాఖలో ముడుపులు తీసుకోవడం - విదేశాల్లో విహరించడానికే సమయం సరిపోతోందన్నారు. నారాయణను వియంకుడిని చేసుకుని నారాయణ కాలేజీలకు గంటా వంతపాడుతున్నారని విమర్శించారు. ఏపీ కేబినెట్ నిండా రావణులు ఉన్నారని రోజా ఫైర్ అయ్యారు. నారాయణ - కామినేని - గంటా - దేవినేని లాంటివారంతా ఆడవాళ్ల జీవితాలతో ఆడుకున్న వారేనని ఆరోపించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News