పగలు.. ప్రతీకారాలు ఎంత దారుణానికైనా దారి తీస్తాయనటానికి తాజా ఉదంతం ఒక నిదర్శనం. వినాయక చవితి సందర్భంగా నిర్వహించే సంబరాల్లో రంగునీళ్లు చల్లుకోవటం ఓ సరదా. అలాంటి సరదాలోనే పగ.. ప్రతీకారం అంటూ ఓ వ్యక్తి చేసిన దుర్మార్గం కారణంగా పదిమంది గాయపడ్డారు. ఈ వికృత ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.
జిల్లాకు చెందిన గంగాధర నెల్లూరు మండలంలో ఒడ్డిపల్లి గ్రామంలో వినాయకచవితి వేడుకలు నిర్వహించారు. అనంతరం రంగునీళ్లతో వసంతం చల్లుకోవటం చేశారు. అయితే.. ఒక బిందెతో నీళ్లు పడిన వెంటనే ఒళ్లు మంటలు పుట్టి.. బొబ్బలు రావటంతో కంగుతిన్నారు. వెంటనే వారిని ఆసుపత్రికి చేర్పించారు. ఈ ఘటనలో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు.
అనంతరం వసంతం ఆడుకోవటానికి తీసుకొచ్చిన బిందెల్ని పరిశీలించగా.. ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి కృష్ణారెడ్దికి చెందిన బిందె గా గుర్తించారు. ఆ గ్రామంలోని వారికి కృష్ణారెడ్డికి మధ్య విబేధాలు కొన్నేళ్లుగా ఉన్నాయి. దీన్ని పురస్కరించుకొని.. పగ తీర్చుకోవటం కోసం రంగు నీళ్లల్లో యాసిడ్ కలిపినట్లు గుర్తించారు. ఈ ఉదంతంపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. యాసిడ్ రంగునీళ్లకు కారణమైనట్లుగా భావిస్తున్న కృష్ణారెడ్డి పరారీలో ఉన్నారు. అతని కోసం పోలీసులు తీవ్రంగా గాలింపులు జరుపుతున్నారు.