ధవన్ స్థానంలో పంత్‌ నే ఎందుకు తీసుకుంటున్నారో తెలుసా?

Update: 2019-06-12 17:30 GMT
టీమిండియా డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధవన్.. లండన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో గాయపడిన విషయం తెలిసిందే. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆసీస్ బౌలర్ విసిరిన బంతి అతడి ఎడమచేతి బొటన వేలికి బలంగా తగిలింది. ఫిజియోతో ప్రథమ చికిత్స చేయించుకుని - అలాగే బ్యాటింగ్ చేసిన ధవన్.. 117 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం స్కానింగ్‌ చేయించగా బొటనవేలికి ఫ్రాక్చర్‌ అయినట్టు తేలింది. దీంతో అతడిని న్యూజిలాండ్‌ తో పాటు కీలక పాకిస్థాన్‌ - అఫ్ఘానిస్థాన్‌ మ్యాచ్‌ లకు దూరం కానున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

 గాయపడి విశ్రాంతి తీసుకుంటున్న ధవన్ స్థానంలో లోకేష్ రాహుల్ ఓపెనింగ్ చేయడం ఖాయమైంది. అయితే, కీలకమైన నాలుగో నంబర్‌ లో ఎవరు ఆడతారనేది ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం జట్టుతోనే ఉన్న దినేష్ కార్తీక్ - ఆల్‌ రౌండర్ విజయ్ శంకర్‌ లో ఒకరికి అవకాశం దక్కుతుందని జట్టు మేనేజ్‌ మెంట్ సూచాయగా చెబుతున్నా.. బీసీసీఐ మాత్రం రిషబ్ పంత్‌ ను పిలిపించింది. వీలైనంత త్వరగా వచ్చి జట్టుతో కలవాలని సూచించింది. దీంతో ఈ యువ వికెట్ కీపర్ హుటాహుటిన ఇంగ్లండ్ పయనమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు.

 ధవన్ గాయం నుంచి కోలుకునేందుకు ఎంతో సమయం పట్టదని భావించిన టీమిండియా మేనేజ్‌ మెంట్ దినేష్ కార్తీక్ - విజయ్ శంకర్‌ తో మేనేజ్ చేయొచ్చని అనుకుంది. అయితే, మరి గాయం మానడానికి సమయం పడుతుందో.. మరో కారణమో తెలియదు కానీ పంత్‌ ను పిలిపించింది. అసలు ధవన్ స్థానంలో ఈ ఇద్దరు ఆటగాళ్లు ఆడేందుకు అవకాశం ఉంది. అలాగే స్టాండ్ బైగా అంబటి రాయుడు ఉండనే ఉన్నాడు. వీళ్లతో పాటు శ్రేయస్ అయ్యర్ పేరూ తెరపైకి వచ్చింది. వీళ్లందరూ ఉండగా పంత్‌ నే ఎందుకు పిలిపించారు అనే సందేహం అందరిలో కలుగకమానదు.

 రిషబ్ పంత్‌ ను తీసుకోవడానికి వెనుక బలమైన కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఐపీఎల్‌ లో ఢిల్లీ కేపిటల్స్ తరపున ఆడిన అతడు అదరగొట్టాడు. అసాధారణ ఆటతీరుతో తన జట్టు ప్లేఆఫ్స్‌ కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. కొద్దిరోజుల క్రితం ఇంగ్లండ్‌ లో జరిగిన టెస్ట్ సిరీస్‌ లో బ్యాట్స్‌ మన్‌ గా - కీపర్‌ గా రాణించాడు. ముఖ్యంగా ప్రస్తుతం భారత జట్టులో ప్రధాన బ్యాట్స్‌మన్లలో ధవన్ తప్ప మరో లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్‌మన్ లేడు. ఇప్పుడు అతడు గాయపడడంతో అదే చేతి వాటం కలిగిన పంత్‌కు అవకాశం దక్కిందని విశ్వసనీయంగా తెలుస్తోంది.


Tags:    

Similar News