కుర్ర క్రికెటర్ జాక్ పాట్..ఒకేసారి ఐదు కోట్ల డీల్!

Update: 2019-03-08 08:49 GMT
పరిమిత ఓవర్ల క్రికెట్ లో అంతగా రాణించలేకపోయినా.. టెస్టుల్లో రాణింపుతో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు  రిషబ్ పంత్. ఐపీఎల్ లో బాగా రాణించి జాతీయ జట్టులో స్థానం పొందాడు ఈ కుర్రాడు. అయితే అంతర్జాతీయ వన్డే - టీట్వంటీల్లో మాత్రం తన స్థాయికి తగ్గ ఆట ఇంకా ఆడలేదు. అయితే దక్షిణాఫ్రికా - ఆస్ట్రేలియాల్లో జరిగిన టెస్టు సీరిస్ లో పంత్ రాణించాడు.  ధోనీ టెస్టుల నుంచి రిటైర్ అయిన అనంతరం.. కొంత కాలం పాటు సాహా కీపర్ గా బాధ్యతలు చేపట్టాడు. గాయంతో అతడు జట్టుకు దూరం కావడంతో పంత్ కు ఛాన్స్ వచ్చింది. దాన్ని  ఇతడు సద్వినియోగం చేసుకున్నాడు.

ఇక ఆస్ట్రేలియాలో ఇతడి స్లెడ్జింగ్ కూడా బాగా చర్చనీయాంశంగా నిలిచింది. ఆసీస్ టెస్టు కెప్టెన్ పైన్ తో పంత్ సంభాషణ క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా నిలిచింది. సరదాగా.. అదే సమయంలో హుందాగా వ్యవహరించి ఈ కుర్రాడు క్రికెట్ ప్రియుల మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. పైన్ పిల్లలను సరదాగా బేబీ సిట్టింగ్ చేసి..పంత్ వ్వావ్.. అనిపించాడు.

అలాంటి పంత్ కు ఇప్పుడు జాక్ పాట్ తగ్గింది. బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్స్ లో పంత్ కు స్థానం లభించడం విశేషం. అది కూడా ఒకేసారి ఇతడిని ‘ఏ’గ్రేడ్ లోకి  తీసుకుంది బోర్డు. దీని వల్ల ఇతడికి ప్రతియేటా ఐదు కోట్ల రూపాయల భారీ మొత్తం లభిస్తుంది!

కొత్త కుర్రాడు.. బోర్డు కాంట్రాక్టు పరిధిలోకి వెళ్లడం విశేషం ఏమీ కాదు. గత ఏడాలి కాంట్రాక్ట్ జాబితాలో లేనేలేని ఇతడు సి గ్రేడ్ లో స్థానం సంపాదించి ఉంటే అది పెద్ద విశేషం అయ్యేది కాదు. సీనియర్ ప్లేయర్లు ఉండే.. ఏ గ్రేడ్ లో పంత్ స్థానం సంపాదించాడు. ఏకంగా ఐదు కోట్ల రూపాయల వార్షిక వేతనాన్ని పొందనున్నాడు. ఐపీఎల్, ఇతర ఎండార్స్ మెంట్లు, ఒప్పందాలు - మ్యాచ్ ఫీజులు కాకుండా.. ఈ వార్షిక వేతనం పంత్ కు కేవలం బోనస్ మాత్రమే! ఇంతేజేసీ ఇప్పుడు కుర్రాడి వయసు 21!
Tags:    

Similar News