కొడంగ‌ల్ హైటెన్ష‌న్ - రేవంత్ అరెస్ట్ !

Update: 2018-12-04 03:36 GMT
వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం రాష్ట్రంలో ఇపుడు సంచ‌ల‌నం. రాష్ట్రం మొత్తం అటే చూస్తోంది. ప్ర‌తిక్ష‌ణం ఉత్కంఠ భ‌రితం.  కాంగ్రెస్‌లో కేసీఆర్ ఏకైక ప్ర‌త్య‌ర్థిగా రేవంత్ త‌న‌కు తాను భావిస్తూ ఉంటారు.. దానికి త‌గ్గ‌ట్టే కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ ఆయ‌న విమ‌ర్శ‌లు చేస్తూ ఉంటారు. ఈరోజు ఆ నియోజ‌క‌వ‌ర్గంలోని కోస్గి ప‌ట్ట‌ణంలో కేసీఆర్ స‌భ జ‌రుగుతుండ‌టంతో ఏం జ‌రుగుతుందా? అని రాష్ట్రం మొత్తం ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది. పైగా స‌భ‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న ర్యాలీ తీస్తామ‌ని రేవంత్ ప్ర‌క‌టించ‌డంతో ఈసీ సీరియ‌స్‌గా ప‌రిగ‌ణించిన విష‌యం తెలిసిందే. దీంతో గొడ‌వ‌లేమీ జరగకుండా పోలీసు అధికారులు 144 సెక్షన్  విధించారు.

తాజాగా తెల్లారి 3 గంటలకు రేవంత్‌రెడ్డి ఇంట్లో కి గేటు ప‌గ‌ల‌గొట్టి పోలీసులు ఒకేసారి వంద మందికి పైగా ప్ర‌వేశించారు. రేవంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. రేవంత్ ఆయన సోదరుడు కొండల్‌ రెడ్డిని, ప‌లువురు ప్రధాన అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. రేవంత్‌ను మొద‌ట‌ జడ్చర్ల ట్రైనింగ్‌ సెంటర్‌కు, ఆ త‌ర్వాత షాద్‌న‌గ‌ర్ పోలీస్ స్టేష‌నుకు తరలించినట్టుగా తెలుస్తోంది. రేవంత్‌ అరెస్ట్‌తో కొడంగల్‌లో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. రేవంత్ కేసీఆర్ స‌భ‌ను అడ్డుకునే ఆలోచ‌న చేయ‌డం వ‌ల్లే అరెస్టు చేయాల్సి వ‌చ్చింద‌న్న‌ది పోలీసుల వాద‌న‌.

అయితే పోలీసుల తీరు పై రేవంత్‌ భార్య గీత తీవ్ర‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అరాచ‌కానికి పరాకాష్ట. రేవంత్ రెడ్డి ఏమైనా ఉగ్ర‌వాదా? పోలీసులు తలుపు విరగగొట్టి ఇంటి లోపలకి రావాల్సిన అవ‌స‌రం ఏముంది? ఇంట్లో ఉన్న వ్యక్తికి భద్రత లేకపోతే ఎలా? అని ప్రశ్నించారు. తమ ఆత్మ గౌరవం మీద దెబ్బకొడితే ఊరుకోమని ఆమె మండిపడ్డారు. ఇది క‌క్ష‌సాధింపు అని ఆమె వ్యాఖ్యానించింది. ఎపుడూ ఒక‌టే ప్ర‌భుత్వాలు ఉండ‌వు... పోలీసులు సంయ‌మ‌నంతో వ్య‌వ‌హ‌రించాలి అని ఆమె అన్నారు.
Tags:    

Similar News