బెయిల్‌ వచ్చిన రేవంత్‌ ఎందుకు విడుదల కాలేదు?

Update: 2015-07-01 04:20 GMT
మంగళవారం ఉదయం తెలుగుదేశం పార్టీలో పండుగ వాతావరణం చోటుచేసుకుంది. ఓటుకు నోటు కేసులో చిక్కి దాదాపు 30 రోజులు జైల్లో ఉన్న ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి హైకోర్టు బెయిల్‌ ఇవ్వటంతో తెలంగాణ.. ఆంధ్రా అన్న తేడా లేకుండా తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేసుకున్నారు.

రేవంత్‌ రాక కోసం ఆయన అభిమానులు.. నేతలుఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే.. హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతిలో దొర్లిన తప్పు ఆయన విడుదలకు అడ్డుపడిందని చెబుతున్నారు.

రేవంత్‌కు బెయిల్‌ మంజూరు చేసిన ఉత్తర్వులో టైపిస్ట్‌ తప్పుగా టైప్‌ చేశారని చెబుతున్నారు. హైకోర్టు ఉత్తర్లు కాపీలో ఏసీబీ ప్రత్యేక కోర్టుకు ఆదేశాలు ఇస్తున్నట్లు ఉండాలి. కానీ.. అందుకు ఏసీబీ అధికారులకు ఆదేశాలు ఇస్తున్నట్లుగా ఉంది. టైపింగ్‌లో దొర్లిన పొరపాటు కారణంగా ఇలాంటివి చోటు చేసుకుంటాయి. దీంతో.. బుధవారం హైకోర్టులో సవరణ మెమో దాఖలు చేసి.. తదుపరి ఉత్తర్వుల ప్రకారం బెయిల్‌ పొందే అవకాశం ఉంది.

అయితే.. ఈ ప్రక్రియ మొత్తం బుధవారం సాయంత్రం 5.30 గంటల లోపు పూర్తి కావాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ సమయం లోపు ప్రక్రియ పూర్తి కాని పక్షంలో బుధవారం కూడా రేవంత్‌ రెడ్డి బయటకు వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు.

Tags:    

Similar News