రివెంజ్ పాలిటిక్స్ : తమిళనాడు, ఏపీ... తాజాగా తెలంగాణ వంతు

Update: 2022-01-04 01:30 GMT
పేరుకు రెండు తెలుగు రాష్ట్రాలే అయినప్పటికీ ఏపీలో రాజకీయం ఒకలా.. తెలంగాణలో రాజకీయం మరోలా ఉంటుంది. ఒకదానికి మరొకటి సంబంధం ఉండదు. తరచి చూస్తే..ఈ రెండు రాష్ట్రాల ప్రజలు వివిధ అంశాల మీద స్పందించే తీరులోనూ తేడా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. ఏపీలో కులానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే.. తెలంగాణ ప్రజలు అందుకు భిన్నంగా భావజాలానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఏపీలో ప్రజలకు వినోదం అంటే సినిమాలకు వెళ్లటం అయితే.. తెలంగాణలో ప్రజలకు వినోదం అంటూ కలిసి కూర్చొని మాట్లాడుకోవటం.. పాటలు పాడుకోవటం.. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఆహార అలవాట్లు మొదలు చాలానే అంశాల్లో వ్యత్యాసం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.

ఏపీలో పగలు.. ప్రతీకారాలు చాలా ఎక్కువ. కోస్తాలో గుంటూరు జిల్లా.. సీమలోని కడప.. కర్నూలు.. అనంతపురం జిల్లాల్లోని రక్తపాత రాజకీయాలు తెలియంది కాదు. కానీ.. తెలంగాణలో అలాంటి ఫ్యాక్షన్ రాజకీయాలు పెద్దగా కనిపించవు. అక్కడక్కడ భూస్వాముల బలం ఉంటుంది కానీ.. అది కూడా పరిమితంగానే ఉంటుంది. పగతో రగిలిపోయి.. వర్గాలుగా వీడిపోయి రాజకీయం కోసం తన్నుకునే పరిస్థితులు తక్కువగా ఉంటాయి. అలాంటి పరిస్థితులు తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో మారిపోనుందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది.

ఇంతకాలం రాజకీయంగా విభేదాలు ఉండొచ్చు కానీ వ్యక్తిగత స్థాయిలోకి తీసుకున్న వైనం ఇప్పటివరకు లేదు. పాతతరం రాజకీయానికి కొత్త తరం రాజకీయాన్ని కలిపేసి.. సరికొత్త బ్లెండెడ్ రాజకీయాల్ని తెర మీదకు తీసుకొచ్చిన గులాబీ బాస్ కేసీఆర్ దీనికి మూలంగా చెప్పాలి. తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త కోణాల్ని పరిచయం చేసిన క్రెడిట్ ఆయనకే దక్కుతుంది. ఉద్యమ రాజకీయ పార్టీగా మొదలైన ఆయన ప్రయాణం.. రాజకీయ పార్టీగా అవతరించినట్లుగా చెప్పిన నాటి నుంచి ఆయన తీసుకున్న నిర్ణయాలు.. వేస్తున్న అడుగులు వేలెత్తి చూపించేలా మారాయి.

తెలంగాణ ఉద్యమం కోసం ఆయన గళం విప్పినప్పుడు.. ఉద్యమ పార్టీగా ఉన్న ఆయనకు ఇవ్వాల్సిన స్వేచ్ఛను.. నిరసనన వ్యక్తం చేయటానికి అవకాశాల్ని ఇచ్చారు. అలాంటి ఆయన.. అధికారంలెకి వచ్చిన తర్వాత నిరసన అన్నంతనే హౌస్ అరెస్టు చేసేస్తున్నారు. ఇక.. ఏదైనా భారీ ఆందోళనకు పిలుపునిస్తే.. ఆ వెంటనే సదరు నేతల్ని ఇంట్లో నుంచి బయటకు రానివ్వటంలేదు. ఒకవేళ అవరోధాల్ని దాటుకొని వస్తే.. నిర్మోహమాటంగా అరెస్టులు చేయటానికి వెనుకాడటం లేదు.

రాజకీయాలు నడిపే ప్రతి పార్టీకి లక్ష్మణ రేఖ అంటూ ఉంటుంది. అయితే.. తాము తప్పించి.. మిగిలిన వారెవరూ ఆ రేఖను దాట కూడదన్నట్లుగా వ్యవహరిస్తున్న కేసీఆర్ ధోరణిపై ఇప్పటికే ఆగ్రహం వ్యక్తమవుతోంది. అంతేకాదు.. తనను ఎదిరించిన ఏ నేతకు.. ఆ తర్వాత రాజకీయ జీవితమే లేని విధంగా పరిస్థితుల్ని కల్పించే విషయంలో కేసీఆర్ కున్న ట్రాక్ రికార్డు అంతా ఇంతా కాదు. అలాంటి హిస్టరీని తిరిగరాసింది మాత్రం ఈటల రాజేందర్ అనే చెప్పాలి. ఉద్యమ పార్టీగా మొదలైన కేసీఆర్ ప్రతిఅడుగులో ఉన్న ఈటల.. ఆ తర్వాత కేసీఆర్ ఆగ్రహానికి గురి కావటం.. ఏం చేసైనా సరే.. ఉప ఎన్నికల్లో ఆయన గెలవకూడదన్న పట్టుదలతో వ్యవహరించినప్పటికీ ఆయన గెలుపును మాత్రం అడ్డుకోలేకపోయారు.

విజయం సాధించిన తర్వాత తన సన్నిహితులతో మాట్లాడిన ఈటల.. తనకు ఇదో రాజకీయ పునర్జన్మగా పేర్కొని.. ఇన్నేళ్లలో ఎప్పుడూ ఎదురుకాని ప్రతికూలతల్ని తాను ఎదుర్కోన్నానని.. ఎట్టి పరిస్థితుల్లో వాటిని మర్చిపోలేనని.. అన్నింటికి బదులు ఇవ్వాల్సిందే అంటూ చెప్పినట్లుగా చెబుతారు. ఆయనే కాదు.. పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ కూడా. ఓటుకు నోటు కేసులో తనను అడ్డంగా బుక్ చేసిన కేసీఆర్ అండ్ కోను ఎట్టి పరిస్థితుల్లో వదలనంటూ తొడ కొట్టి మరీ సవాలు చేసిన వైనాన్ని మర్చిపోకూడదు.

తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబరు 317కు వ్యతిరేకంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన నిరసనకు ఎలాంటి అనుమతులు లేవని చెప్పటం ఒక ఎత్తు.. ఆయన్ను అరెస్టు చేసేందుకు అనుసరించిన విధానం కొత్త తరహా రాజకీయానికి తెర తీసిందన్న మాట బలంగా వినిపిస్తోంది. కేసీఆర్ ఈ రోజున ఏ తీరులో నిరసనల్ని అణిచివేస్తున్నారో.. అదే రీతిలో ఉమ్మడి రాష్ట్ర పాలకులు వ్యవహరించి ఉంటే.. కేసీఆర్ ఏం చేసేవారు? అన్న మాట పలువురి నోట వినిపించటం గమనార్హం.

మొన్నటికి మొన్న తన ఇంట్లోకి తెల్లవారు జామున పోలీసులు వెనుక నుంచి ప్రవేశించారని పేర్కొంటూ రేవంత్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటంతో పాటు.. లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. తాజాగా బండి సంజయ్ ను అరెస్టు చేసిన తీరు.. ఆయనపై నమోదు చేసిన సెక్షన్లపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడ్ని అరెస్టు చేసి.. రిమాండ్ వెళ్లేలా చేసిన కేసీఆర్ సర్కారుకు అంతకంత తప్పదన్న హెచ్చరికలు ఎదురుకావటం చూస్తే.. ఇప్పటి వరకు జరిగిన రాజకీయానికి భిన్నమైన రాజకీయానికి 'ఆదివారం' కరీంనగర్ లో బీజం పడిందన్న మాట వినిపిస్తోంది. తెలంగాణలో మొదలైనట్లుగా చెబుతున్న కొత్త తరహా రాజకీయం రానున్న రోజుల్లో పగ.. ప్రతీకారాల రాజకీయంగా మారుతుందన్నది ఎంత వరకు నిజమన్నది కాలమే సరైన సమాధానం చెప్పగలుగుతుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News