కాంగ్రెస్ - సీపీఐ మైత్రికి బీటలు పెట్టిన తెలంగాణ మంత్రి..?
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొత్తగూడెం నుంచి పోటీ చేసే ఆలోచనతో ఉన్నారట. అందుకే ఇప్పటి నుంచే అక్కడ తన పట్టు పెంచుకోవాలని ఆయన భావిస్తున్నారు.;
ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వేస్తున్న రాజకీయ ఎత్తుగడలు మిత్రపక్షాల మధ్య చిచ్చు పెడుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్, సీపీఐ పార్టీలు కలిసి నడిచాయి. ఆ పొత్తులో భాగంగానే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం నుండి విజయం సాధించారు. సీపీఐకు రాష్ట్రం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ కేటాయించిన ఒకే ఒక సీటు ఇది. ప్రస్తుతం జరుగుతోన్న మునిసిపల్ ఎన్నికల వేళ సీన్ పూర్తిగా మారిపోయింది. తన నియోజకవర్గమైన పాలేరు పరిధిలోని ఏదులాపురం మున్సిపాలిటీతో పాటు కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో కూడా సీపీఐతో పొత్తులను పొంగులేటి బ్రేకప్ చేయించారు. పొంగులేటి తీరుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌కు నమ్మకమైన మిత్రపక్షం అయిన సీపీఐతో పొత్తు కటిఫ్ అయ్యింది. మంత్రి తీసుకున్న ఈ నిర్ణయం వెనుక లోతైన రాజకీయ వ్యూహాలు ఉన్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
మంత్రి పొంగులేటి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏదులాపురం మున్సిపాలిటీలో మొత్తం 32 వార్డులు ఉన్నాయి. ఇక్కడ సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ బలంగా ఉండటంతో ఆ పార్టీ 16 సీట్లు ఆశించింది. కనీసం 10 సీట్లు అయినా దక్కుతాయని భావించిన సీపీఐకి పొంగులేటి గట్టి షాక్ ఇచ్చారు. చివరకు 4 సీట్లు అయినా సీపీఐకు ఇస్తారు అనుకుంటే... పొత్తుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్ అభ్యర్థులను రంగంలోకి దించారు. అటు కొత్తగూడెం కార్పొరేషన్ లోని 60 వార్డుల విషయంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కొత్తగూడెంలో 33, పాల్వంచలో 27 వార్డులు ఉండగా.. అక్కడ అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు అన్నీ మంత్రి తన కనుసన్నల్లోనే నడిపిస్తున్నారు. సీపీఐని మిత్రపక్షంగా చూడకుండా ప్రత్యర్థిగా పరిగణించడం రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొత్తగూడెం నుంచి పోటీ చేసే ఆలోచనతో ఉన్నారట. అందుకే ఇప్పటి నుంచే అక్కడ తన పట్టు పెంచుకోవాలని ఆయన భావిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న కూనంనేని సాంబశివరావుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక సీట్లు కేటాయిస్తే భవిష్యత్తులో తన రాజకీయాలకు ఇబ్బంది ఎదురవుతుందని పొంగులేటి ఆలోచిస్తున్నారు. ఒకవేళ కార్పొరేషన్ లో సీపీఐకి మేయర్ పదవి దక్కితే ఆ పార్టీ ఇంకా బలపడే అవకాశం ఉంది. అందుకే వ్యూహాత్మకంగా సీపీఐని పక్కన పెట్టి కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసేలా చక్రం తిప్పారు. పొంగులేటి నిర్ణయంతో అసహనానికి గురైన సీపీఐ నేతలు కాంగ్రెస్ ను ఓడించడమే లక్ష్యంగా కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీతో లోపాయికారీ అవగాహన కుదుర్చుకోవడం విశేషం.
కొత్తగూడెం కోటపై జెండా ఎగురవేయాలని మంత్రి చేస్తున్న ప్రయత్నాలు కాంగ్రెస్ లోని ఒక వర్గానికి సంతోషం కలిగిస్తున్నా.. మిత్రపక్షాల మధ్య దూరం పెంచడం రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు ఆగ్రహంతో ఉన్న సీపీఐ కలిసి కాంగ్రెస్ అభ్యర్థులను టార్గెట్ చేస్తున్నాయి. సీపీఐ రాష్ట్ర, జిల్లా స్థాయి ముఖ్య నేతలు ఉన్న ప్రాంతాల్లోనే పొంగులేటి తన ఆధిపత్యం ప్రదర్శించడం విశేషం. పొత్తు ధర్మాన్ని పక్కన పెట్టి వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా సాగుతున్న ఈ పరిణామాలు ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ భవిష్యత్తును ఏ తీరానికి చేరుస్తాయో వేచి చూడాలి. పొంగులేటి వేసిన ఈ పొత్తుల కటిఫ్ ఎత్తుగడ స్థానిక సంస్థల ఫలితాల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది.