మోదీ జోకు రేణుకా కి ఇంత లేటుగా అర్థమైందా..?

Update: 2018-02-08 16:40 GMT
చురకలేయడంలో దిట్ట అయిన ప్రధాని మోదీ నిన్న పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరిపై నవ్వుతూనే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రసంగిస్తున్నప్పుడు ఆమె నవ్వడంతో ఆయన... ఇలాంటి నవ్వును రామాయణంలో చూశాం, మళ్లీ ఇప్పుడు చూస్తున్నాం అంటూ కౌంటరేశారు. అంటే... రేణుకాచౌదరిని ఆయన ఇండైరెక్టుగా రావణాసురుడితో పోల్చారు. అయితే... ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తీవ్రంగా పరిగణిస్తోంది. సభలో దానిపై పెద్దగా రభస చేయని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మోదీపై ఏకంగా ప్రివిలైజ్ మోషన్ పెట్టాలని అనుకుంటోందట.    
    
రేణుకా చౌదరి సహా - కాంగ్రెస్‌ మహిళాప్రతినిధుల  బృందం  గురువారం  రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్య నాయుడుని  కలిసి ఈ సందర్భంగా ప్రధాని క్షమాపణ   చెప్పాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా రేణుకా చౌదరి మాట్లాడుతూ ప్రధానికి సభా హక్కుల ఉల్లంఘన  నోటీసులిచ్చేందుకు  యోచిస్తున్నాననీ,  పార్టీతో సంప్రదింపుల అనంతరం దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. తాను ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాననీ.. దీనికి తాను ఎలాంటి జీఎస్‌టీ కట్టక్కలేదంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
Read more!
    
అయితే.. మోదీ వ్యాఖ్యలను ఇతర పార్టీలు పెద్ద సీరియస్ గా తీసుకున్నట్లుగా లేవు. కాంగ్రెస్‌ నిర్ణయానికి తమ మద్దతు ఉంటుందని, అయితే  వివాదం రేపవద్దని ఎన్‌ సీపీ   నాయకులు చెప్పడమే దీనికి ఉదాహరణ. అయితే.. గురువారం రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యలు మాత్రం దీనిపై కొద్దిసేపు గొడవ చేశారు. అంతేకాదు...  రేణుకపై  ప్రధాని అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ  కాంగ్రెస్‌ పార్టీ గురువారం ట్వీట్‌ చేసింది. మరి రేణుక అండ్ కో హడావుడి చేసి వదిలేయకుండా నిజంగానే ప్రధానిపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తే మాత్రం అది ఆయన ప్రతిష్ఠకు దెబ్బేనని చెప్పాలి.

Tags:    

Similar News