మోడీపై కేటీఆర్ ఆగ్ర‌హం ఇందుకే..

Update: 2016-01-04 10:39 GMT
తెలంగాణ రాష్ర్ట ముఖ్య‌మంత్రి-టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ త‌న‌యుడు మంత్రి కేటీఆర్ త‌న తండ్రిపై మ‌మ‌కారం చాటుకునేందుకు వ‌చ్చిన ఏ అవ‌కాశాన్ని వ‌దులుకోవ‌డం లేదు. ఇప్ప‌టికే తండ్రి అడుగుజాడ‌ల్లో న‌డుస్తూ పార్టీ కార్య‌క్ర‌మాల్లో-ప్ర‌భుత్వం చేప‌డుతున్న ప‌నుల్లో క్రియాశీలంగా పాల్గొంటున్న కేటీఆర్ తాజాగా తండ్రి క‌ళ్ల‌ల్లో ఆనందం కోసం భారీ స్టేట్‌ మెంట్‌ లు ఇచ్చేశారు.

కేసీఆర్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించిన అయుత చండీయాగానికి రావాల్సిందిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ - రాష్ర్ట‌ప‌తి త‌దిత‌రుల‌ను ఢిల్లీకి వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. రాష్ర్ట‌ప‌తి హాజరు అయ్యేందుకు వ‌చ్చినప్ప‌టికీ యాగ‌శాల ద‌గ్దం కావ‌డంతో ఆయ‌న వేదిక వ‌ర‌కు రాలేదు. అయితే మోడీ మాత్రం యాగం ఊసెత్త‌లేదు. దీంతో కేటీఆర్‌ అసహనంతో ఉన్నట్లు స‌మాచారం.యాగం ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకొని కేటీఆర్ వ్య‌వ‌హ‌రించిన తీరే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని అంటున్నారు. తాజాగా మీడియాతో చిట్ చాట్ సందర్భంగా కేటీఆర్ మోడీని తీవ్రంగా విమర్శించారు.

తెలుగు రాష్ట్రాలకు ప్రధాన మంత్రి మోడీ ఒరగబెట్టింది ఏమీ లేదని, పిలిచినా ఆయన రాష్ట్రానికి రావడం లేదని మండిప‌డ్డారు. తెలంగాణ‌కు పిలిచినా రావడం లేదన్న కేటీఆర్, దేనికి రావడం లేదో స్పష్టంగా చెప్పకపోవ‌డం గ‌మ‌నార్హం. ప్రధానమంత్రి అయుత చండీయాగానికి వస్తారని ఆశించినప్పటికీ ఆయన రాక‌పోవ‌డంతో కేటీఆర్ ప‌రోక్షంగా "తెలంగాణ భార‌త‌దేశంలో లేదా? ఇక్క‌డికి పిలిచినా ఎందుకు రారు?" అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం గుప్పించార‌ని అంటున్నారు. ప్ర‌ధాన‌మంత్రి రాక‌తో తండ్రి క‌ళ్ల‌లో ఆనందం చూద్దామంటే అది వీలుకాక‌పోడంతోనే కేటీఆర్ గుస్సాకు కార‌ణ‌మ‌ని భావిస్తున్నారు.
Tags:    

Similar News