చంద్రుని నిశబ్దం వెనుక...

Update: 2018-09-21 16:28 GMT
ప్రగతి నివేదన సభ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి జోరు తగ్గిందా........పూర్వం ఉన్న ఉత్సాహం ఇప్పుడు లేదా....... అవుననే  అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..

సార్వత్రికల ఎన్నికలకు 9 నెలలు ముందే ముందస్తు ప్రకటించిన తెరాస - శాసనసభ రద్దునకు - ఎన్నికలకు మూహుర్తం కూడా నిర్ణయించుకుని - ముందస్తుకు 105 మంది అభ్యర్దులను కూడా ప్రకటించి అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రగతి నివేదన సభతో ప్రతిపక్షాల గుండెళ్లలో రైళ్లు పరిగెత్తిద్దామనుకున్న కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు సీన్ రివర్స్ అయింది. ప్రగతి నివేదన సభతో తమ అంచనాలు తారుమారు అయ్యాయి. గత వారం రోజులుగా తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు గాని, ఆయన కుమారుడు తారక రామారావు గాని ఎటువంటి ప్రకటనలు చేయకపోవడం గమనార్హం. ఎన్నికలు ప్రకటన తర్వాత రాబోయే రెండు నెలలలో  తెరాస పార్టీ 100 సభలు పెడుతుందని ప్రకటించిన కేసీఆర్ - ఆ సభల యొక్క తేదీలను ప్రకటించకపోవడం సర్వత్ర చర్చనీయాంశమయ్యింది. హుస్నాబాద్ సభ తర్వాత  కేసీఆర్ ఎటువంటి సభలు - సమావేశాలు నిర్వహించలేదు. గత వారం రోజులుగా  గజ్వేల్‌ లో తన ఫార్మ్ హౌజ్‌ లోనే ఉండిపోయినట్లు తెలుస్తోంది.

పార్టీ కార్యకర్తలకు గాని - నాయకులకు గాని అందుబాటులో ఉండడం లేదని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.తమ గెలుపు నల్లేరు మీద నడకేనని కేసీఆర్ ఇచ్చిన భరోసతో పార్టీలోని నాయకుల ఉత్సాహం - ఇప్పుడు నీరుగారి పోయింది. ప్రచారంలో భాగంగా ప్రజలలోకి వెడుతున్న పార్టీ నాయకులకు - కార్యకర్తలకు వారి నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండడంతో - తెరాసగెలుపు అంత సులువు కాదని వారు అధిష్టానం దగ్గర మొర పెట్టుకున్నట్లు సమాచారం. రాబోయే రోజులలో తెలంగాణలో ఒక్కొక్క జిల్లాకు - ఒక సభను మాత్రమే నిర్వహించాలని తెరాస నాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం. అంటే కేవలం 31 సభలు మాత్రమే నిర్వహించడానికి నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఎన్నికల తేదీలను కేసీఆర్ ప్రకటించడంపై ఎన్నికల సంఘం ఆగ్రహించింది. ఎన్నికలకు వెళ్లడమే పార్టీల పనిగాని - వాటి తేదీలను నిర్ణయించే హక్కు వారికి లేదని - కేసీఆర్ ఈ విషయంలో అత్యుత్సాహానికి వెడుతున్నారని ఎన్నికల సంఘం అభిప్రాయ పడింది. ముందస్తుపై న్యాయస్థానానికి వెళ్లే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది.   చంద్రశేఖర రావు అనుకుంటున్నట్లు ఎన్నికలు జరగకపోవచ్చునని, మరో రెండు లేక మూడు నెలలు ఎన్నికలు వెనకకు వెడితే ప్రతిపక్షాలు అన్నీ ఒకటయ్యేందుకు అవకాశాలు ఎక్కువవుతాయని తేరాస భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఏమి చేయాలో పాలుపోక తేరాస అధిష్టానం నిశబ్దంగా ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
Tags:    

Similar News