మంత్రులతో పెట్టుకుంటే ఏసీబీ దాడులే

Update: 2017-06-25 07:24 GMT
ఏసీబీకి పట్టుబడ్డ ప్రజారోగ్య శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ పాండురంగారావు వ్యవహారంలో కొందరు రాజకీయ నేతల ప్రమేయమున్నట్లు తెలుస్తోంది. 2007 నుంచి పబ్లిక్‌ హెల్త్‌ - మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ శాఖలకు ఈఎన్‌ సిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పాండురంగారావుకు రాష్ట్రానికి చెందిన ఒక మంత్రితో ఏర్పడిన విభేదాల కారణంగానే ఏసీబీ దాడులకు గురయినట్లు తెలుస్తోంది.
    
నిజానికి నేతలందరితోనూ సఖ్యతగా ఉండే ఈఎన్‌ సికి ఆ మంత్రితో ఈ మధ్యకాలంలోనే విభేదాలు వచ్చినట్లు రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.  మున్సిపల్‌ శాఖలో జరిగే కాంట్రాక్టు పనులతో పాటు ఈ మధ్య కాలంలో జరిగిన బదిలీల వ్యవహారంలో ఈఎన్‌సి వ్యవహారశైలిపై సదరు మంత్రి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి పాండురంగారావుపై రహస్యంగా విచారణ చేయించిన సదరు మంత్రి - ప్రాథమిక ఆధారాలు లభించగానే కొందరు కాంట్రాక్టర్లు - ఉద్యోగులతో అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదులు చేయించినట్లు తెలుస్తోంది.
    
మరోవైపు కృష్ణాజిల్లాకు చెందిన - అధికార పార్టీలో ప్రస్తుతం కీలక బాధ్యతలో ఉన్న ఒక మాజీ మంత్రికి పాండురంగారావు బినామీగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. 2011లో పాండురంగారావుపై ఆరోపణలు వచ్చినప్పటికీ ఆయనే ఎటువంటి చర్యలు తీసుకోకుండా అడ్డుకున్నట్లు సమాచారం.  తాజాగా జరిగిన దాడుల్లో పట్టుబడిన ఆస్తుల్లో కొన్ని సదరు నేతకు సంబంధించినవే ఉన్నట్లు విమర్శలొస్తున్నాయి. కాగా ఇప్పటికీ పాండురంగారావు ధీమాగా ఉన్నారని... ఆయన లాకర్ల వివరాలేవీ బయటకు రాకుండా చూసుకున్నారని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News