'వందేమాతరం' వెనుక అసలు వ్యూహం.. ఇదేనా?
అయితే.. ప్రధాని మోడీ వందేమాతరం గేయానికి 150 ఏళ్లు నిండిన సందర్భాన్ని తనకు అవకాశంగా మార్చుకున్నారని.. లోక్ సభలో ప్రతిపక్షాలు నిప్పులు చెరిగాయి.;
పార్లమెంటు వేదికగా.. చర్చించేందుకు జాతీయ గేయం వందేమాతరాన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఎంచుకోవడం వెనుక రీజన్ ఉందా? తెరవెనుక వేరే ఉద్దేశం కూడా దాగి ఉందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. వాస్తవానికి ప్రస్తుతం(సోమవారం నాటికి) దేశంలో అత్యంత కీలకమైన, లక్షలాది మందిని తీవ్రంగా ప్రభావానికి గురిచేసిన అంశాలు రెండు ఉన్నాయి. 1) ఇండిగో విమానాల సంక్షోభం. 2) కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్). ఈ రెండు అంశాలపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. కానీ, ఏరికోరి కేంద్రం వందేమాతరం గేయంపై చర్చకు తెరదీసింది.
అధికార పక్షం చెప్పిందే.. కీలకం కాబట్టి దీనిపైనే సభ దృష్టి పెట్టింది. అయితే.. వందేమాతరంపై చర్చసందర్భంగా.. ప్రధాని మోడీ కీలకమైన అంశాల కంటే.. కూడా ఎక్కువగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర చరిత్ర.. ఆ రాష్ట్రానికే చెందిన జాతీయ గేయం రచయిత బంకిం చంద్ర ఛటర్జీ వృత్తాంతం.. ఆయన ఎదుర్కొన్న అవమానాలు.. బ్రిటీష్ వారు.. అప్పట్లో `గాడ్ సేవ్‌దీ క్వీన్` అనే గీతాన్నిఇంటింటా పాడించాలని చూసినప్పుడు.. వారికి ప్రతిగా బంకిం చంద్ర.. వందేమాతరం గేయాన్నిరాశారని చెప్పారు. ఇది తర్వాత కాలంలో దేశ భక్తిని పురిగొల్పిందని.. అనంతర కాలంలో.. దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చేందుకు వజ్రాయుధంగా కూడా మారిందని ప్రధాని చెప్పుకొచ్చారు.
అయితే.. ప్రధాని మోడీ వందేమాతరం గేయానికి 150 ఏళ్లు నిండిన సందర్భాన్ని తనకు అవకాశంగా మార్చుకున్నారని.. లోక్ సభలో ప్రతిపక్షాలు నిప్పులు చెరిగాయి. వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్(బంకిం చంద్ర ఛటర్జీ జన్మరాష్ట్రం)లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయని.. అందుకే అక్కడ సెంటిమెంటును రాజేసేందుకు ప్రధాని ఈ ప్రయత్నం చేసి.. పార్లమెంటును వినియోగించుకున్నా రని.. విపక్ష నాయకులు దుయ్యబట్టారు. ఇక, ఇదే అంశంపై జాతీయ మీడియాలో కూడా పలువురు విశ్లేషకులు స్పందిస్తూ.. ఎక్కడ ఎన్నికలు ఉంటే.. అక్కడి పాట పాడడం బీజేపీ నాయకులకు ముఖ్యంగా ప్రధానికి అలవాటుగా మారిందని చెప్పుకొ చ్చారు.
అసలు దేశ చరిత్రలోఎప్పుడూ ఇప్పటి వరకు వందేమాతరం గేయంపై చర్చ చేపట్టలేదన్నారు. ఒకవేళ చర్చ చేపట్టినా.. దానిని రాజకీయాలకు ముడిపెట్టి కామెంట్లు చేయడం సరికాదన్నారు. అయినా.. ప్రస్తుతం ఇండిగో సమస్య దేశాన్ని తీవ్రస్థాయిలో కుదిపేస్తున్న దరిమిలా.. ప్రధాని స్థాయి నాయకుడు 45 నిమిషాల పాటు వందేమాతరంపై చర్చ చేపట్టి.. ప్రసంగించడం.. లక్షలాది మంది ప్రయాణికుల కష్టాలను కనీసం ప్రస్తావించకపోవడం దారుణమని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే ఈ చర్చ కు తెరదీశారన్న వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.