మ‌గాళ్లూ.. ఇక త‌లెత్తుకోండి...! బ‌ట్ట‌తల‌కు శాశ్వ‌త మందు!

ఉద్యోగ జీవితంలో నిత్యం ఒత్తిళ్లు ఎదుర్కొనే యువ‌తకు జుట్టుపై నాలుగు ఈక‌లు కూడా ఉండ‌డం లేదు. ఇది ప్ర‌పంచవ్యాప్త స‌మ‌స్య‌గానూ మారింది.;

Update: 2025-12-08 12:30 GMT

ఈ కాలంలో వ‌య‌సుతో ప‌నిలేదు.. పాతిక దాటాల్సిన అవ‌స‌రం కూడా లేదు.. యువ‌త‌, పురుషుల‌లో చాలామందిని ఆందోళ‌న‌కు గురిచేస్తున్న అంశం జుట్టు రాల‌డం..! 30 ఏళ్ల‌కే బ‌ట్ట‌త‌లతో పెళ్లికాదేమోన‌ని బెంగ‌పెట్టుకుంటున్న యువ‌తకు లెక్కే లేదు. వంశ‌పారంప‌ర్యంగా గ‌తంలో బ‌ట్ట‌త‌ల వ‌చ్చేది.. అది కూడా 50 ఏళ్లు దాటాకా మాత్ర‌మే. కానీ, ఇప్పుడు 20-25 ఏళ్ల వారికీ జుట్టు రాలిపోతోంది. దీనికి కార‌ణాలు.. మాన‌సిక ఒత్తిడి.. మారుతున్న వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు. కాలుష్యం.. అది వాయు, జ‌ల కాలుష్యం కూడా చిన్న వ‌య‌సులోనే మ‌గ‌వారిలో బ‌ట్ట‌త‌ల‌కు దారితీస్తోంది. ఉద్యోగ జీవితంలో నిత్యం ఒత్తిళ్లు ఎదుర్కొనే యువ‌తకు జుట్టుపై నాలుగు ఈక‌లు కూడా ఉండ‌డం లేదు. ఇది ప్ర‌పంచవ్యాప్త స‌మ‌స్య‌గానూ మారింది.

పెళ్లి కాని ప్ర‌సాదులు ఎంద‌రో?

పురుషుల‌కు జుట్టే అందం. నిండైన జుట్టును నున్న‌గా క్రాఫ్ దువ్విన‌వారిని, పొడ‌వాటి కురులను జుల‌పాలుగా వ‌దిలేసే కుర్ర‌కారును చూస్తే ముచ్చ‌టేయ‌ని వారు ఉండ‌రు. జుట్టు రాలిపోతున్న యువ‌త‌, పురుషులకు మాత్రం చాలా బెంగ‌. కేవ‌లం జుట్టు లేద‌ని (బ‌ట్ట‌త‌ల‌) కార‌ణంగా పెళ్లి సంబంధాలు కుద‌ర‌ని వారు ఉన్నారంటే ఆశ్చ‌ర్య పోవాల్సిన ప‌నిలేదు. ఇక న‌డి వ‌య‌సు వారైతే త‌మ‌కు బ‌ట్ట‌ద‌ల వ‌చ్చింద‌ని తెగ మ‌ద‌న‌ప‌డిపోతుంటారు. అందంగా క‌నిపించేందుకు ఎంత ప్ర‌య‌త్నం చేసినా జుట్టు లేక‌పోవ‌డంతో దెబ్బ ప‌డుతోంద‌ని భావిస్తుంటారు. కానీ, ఇక‌పైన ఈ ప‌రిస్థితి ఉండ‌దు.

శాశ్వ‌త ప‌రిష్కారం దిశ‌గా..

డైహైడ్రోటెస్టోస్టెరాన్ (డీహెచ్‌టీ).. జుట్టు ప‌లుచ‌బ‌డేందుకు, క్ర‌మ‌క్ర‌మంగా రాలిపోయేందుకు కార‌ణమ‌య్యే హార్మోన్. శాస్త్ర‌వేత్త‌లు కొత్తగా క‌నుగొన్న చికిత్స‌లో క్లాస్కో టెరోన్ (5శాతం) అనే ద్రావ‌ణాన్ని నేరుగా త‌ల మీద పూస్తారు. దీంతో ఆ ప్రాంతంలో కుదుళ్ల వ‌ద్ద డీహెచ్‌టీ హార్మోన్ ను అడ్డుకుంటుంది. క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ లో ఇది 539 శాతం వ‌ర‌కు కొత్త జ‌ట్టును పెరుగుద‌ల‌ను అందించింది. ఇక్క‌డ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమంటే.. శ‌రీర‌మంతా హార్మోన్ల‌ను ప్ర‌భావితం చేసే మాత్ర‌ల‌కు బ‌దులుగా కొత్త చికిత్సా విధానం కేవలం ఒక ప్రాంతానికే ప‌రిమితం అవుతుంది. పైగా ఇది చాలా సుర‌క్షితం. అంతేకాక టార్గెటెడ్.

-1400 మందిపైగా పురుషుల‌తో నిర్వ‌హించిన రెండు క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ ప్లాసిబోతో పోలిస్తే 539 శాతం మెరుగైన ఫ‌లితం (కొత్త జుట్టు పెరుగుద‌ల‌) అందించింది. ఈ ఔష‌ధం గ‌నుక ఆమోదం పొందితే.. జుట్టు రాల‌డం, బ‌ట్ట‌త‌ల స‌మ‌స్య‌కు శాశ్వ‌తంగా చెక్ పడుతుంది. ప్ర‌పంచవ్యాప్తంగా కోట్లాది మంది పురుషులు మ‌ళ్లీ త‌లెత్తుకునేలా చేస్తుంది. మ‌రి అన్ని అనుమ‌తులు పొంది మార్కెట్లోకి ఎప్పుడు వ‌స్తుందో చూడాలి.

Tags:    

Similar News