తమ్మినేని వారసుడికి ఆముదంగా మారిన సీటు !
ఈ క్రమంలో ఇప్పటి నుంచే జనాలలో ఉండాలనుకున్నా దగ్గర మార్గం అన్నట్లుగా మీడియాతోనే జూనియర్ తమ్మినేని దోస్తీ చేస్తున్నారు అని అంటుజ్ఞ్నారు.;
ఆముదం ఔషధానికి పనికి వస్తుంది. కానీ అదే సమయంలో దానిని సరిగ్గా వాడుకోక పోతే ఇబ్బంది పాలు చేస్తుంది. ఇదంతా ఎందుకంటే శ్రీకాకుళంలో ఒక దిగ్గజ నేత రాజకీయ వారసుడికి రాజకీయం ఆముదం తాగించేలా ఉందని అంటున్నారు. ఆయన ఎదగాలని తండ్రి కోరుకుంటున్నారు. అయితే ఆయన సామర్థ్యాన్ని అధినాయకత్వం లెక్క వేసే పనిలో ఉంది. అదే విధంగా చూస్తే ఆయన కూడా అనుకున్న స్థాయిలో ఫోకస్ అవలేకపోతున్నారు అన్న చర్చ కూడా పార్టీ లోపలా బయటా ఉందిట. ఇంతకీ ఆయన ఎవరూ అంటే మాజీ స్పీకర్ మంత్రిగా కూడా పనిచేసిన శ్రీకాకుళం సీనియర్ నేత తమ్మినేని సీతారాం కుమారుడు తమ్మినేని చిరంజీవి నాగ్. తండ్రితో పాటే చాన్నాళ్ళుగా తిరుగుతున్నా అసలైన సిసలైన రాజకీయం చేయడంలో ఈ వారసుడు ఇంకా వెనకబడి ఉన్నారు అని అంటున్నారు.
వారసుల హవాతో :
ఇక చూస్తే 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు ఈసారి రాజకీయం కూడా చాలా వెరైటీ గా ఉంటుంది అని అంటున్నారు. అధికార టీడీపీతో పాటు విపక్ష వైసీపీలో కూడా తండ్రులకు బదులు తనయులు అనేక చోట్ల పోటీకి దిగే చాన్స్ పక్కగా ఉంది అని అంటున్నారు. ఈ వరసలో అధినాయకత్వానికి ఇప్పటి నుంచే ఒక మాట చెప్పి ఉంచేసుకుని తమ వారసులను రంగంలోకి దించుతున్నారు తండ్రులు. అలా చూస్తే కనుక తమ్మినేని కుమారుడు చిరంజీవి నాగ్ కూడా ఆముదాలవలస నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. అది ఆ కుటుంబానికి చెందిన సీటుగా భావిస్తున్నారు. ఇదే సీటు నుంచి 1983లో తొలిసారి పోటీ చేసి అఖండ విజయం సాధించారు తమ్మినేని సీతారాం. అలా నాలుగు సార్లు టీడీపీ నుంచి ఒకసారి వైసీపీ నుంచి కూడా ఆయన గెలిచి అనేక కీలక పదవులు అందుకున్నారు.
కొడుకు కోసం :
ఇక తమ్మినేని తన రాజకీయ రిటైర్మెంట్ ని 2024 ఎన్నికల్లోనే ప్రకటించాలని అనుకున్నారు. కానీ అప్పట్లో పోటీ తీవ్రంగా ఉండడంతో తమ్మినేనినే ఆముదాలవలస నుంచి పోటీ చేయమని వైసీపీ అధినేత జగన్ ఆదేశించారు. దాంతో ఆయనకు తప్పలేదు, అలా కుమారుడుకి పోటీ చేసే చాన్స్ రాకుండా పోయింది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ 2029 ఎన్నికల్లో పోటీ చేసి తీరాలని తమ్మినేని కుమారుడు గట్టిగా భావిస్తున్నారు. కానీ ఆయన అనుకున్నట్లుగా రాజకీయం సాగకపోవడమే విశేషం అని అంటున్నారు. తమ్మినేని తన కుమారుడిని రాజకీయంగా జోరు చేయమని ప్రోత్సహిస్తున్నారు. అలా జూనియర్ తమ్మినేని తన పొలిటికల్ ప్రమోషన్ మీద ఫోకస్ పెట్టారు అని అంటున్నారు.
ఇమేజ్ సంగతేంటి :
ఈ క్రమంలో ఇప్పటి నుంచే జనాలలో ఉండాలనుకున్నా దగ్గర మార్గం అన్నట్లుగా మీడియాతోనే జూనియర్ తమ్మినేని దోస్తీ చేస్తున్నారు అని అంటుజ్ఞ్నారు. ఆయన యూట్యూబ్ చానళ్ళతో పాటు పలు మీడియా సంస్థలను పిలిచి మరీ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అయితే ఆయన ఆయన వ్యవహరిస్తున్న తీరు కారణంగానూ అదే విధంగా జనంలో పెద్దగా తిరగకపోవడం వల్లనూ ఆయన ఆశించిన హైప్ అయితే వీటి వల్ల రావడం లేదని అంటున్నారు. మీడియా బేబీగా ఉంటే ఉపయోగం ఏంటన్న ప్రశ్నలు వస్తున్నాయి.
జనంలో ఉండాల్సిందే :
ఏ నాయకుడు అయినా ఎదగాలి అంటే జనంతో ఉండాలి, నిరంతరం వారి సమస్యల పట్ల పోరాటం చేయాలి. అంతే తప్ప షార్ట్ కట్స్ అయితే ఎక్కడా ఉండవు. కానీ తమ్మినేని కుమారుడు మాత్రం ఈ మార్గమే ఎంచుకుంటున్నారు. మీడియాని దగ్గరకు తీస్తే నాయకులు అయిపోతే అందరూ ఇదే రూట్ లో ఉంటారని అంటున్నారు జనాలలో ఈ యువ నేత తిరిగితేనే మేలు జరుగుతుందని సూచనలు వస్తున్నాయి.
కూనతో టఫ్ ఫైట్ :
ఇక చూస్తే టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఉన్నారు. ఆయన ఎవరో కాదు తమ్మినేనికి మేనల్లుడే. అంటే చిరంజీవి నాగ్ కి ఆయన బావ వరస అవుతారు అన్న మాట. మరి కూనని గెలవడం అన్నది బిగ్ టాస్క్ గా చెబుతున్నారు. జనంలో పాతుకుని పోయారు అని అంటున్నారు. మేనమామ దూకుడుని ఆయన ఒడుపు అయిన రాజకీయాన్ని కూన సొంతం చేసుకుని ముందుకు సాగుతున్న వేళ జూనియర్ తమ్మినేని కూన మీద గెలవాలి అంటే ఎంతో పరిశ్రమించాలని అంటున్నారు. మొత్తానికి ఆముదాలవలసలో వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలన్నది వైసీపీ ఇంకా తేల్చలేదు. ఈలోగా జూనియర్ తమ్మినేని పుంజుకుంటే ఓకే కానీ లేకపోతే వేరేగా ఆలోచించినా చేయవచ్చు అని అంటున్నారు.