చంద్రబాబు బాటలోనే.. రేవంత్ రెడ్డి! గ్లోబల్ సమ్మిట్ పై ఆసక్తికర చర్చ
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావాలని ఏపీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు.;
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావాలని ఏపీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ఈ సదస్సు తెలంగాణా రాష్ట్ర అభివృద్ధికి, పురోగతికి, ఆవిష్కరణలకు వేదిక కావాలని ఆకాంక్షిస్తున్నానని ఎక్స్ లో పోస్టు చేశారు. సీఎం చంద్రబాబు చేసిన పోస్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రతిస్పందించారు. చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. నిజానికి ఈ సమ్మిట్ కు చంద్రబాబు కూడా హాజరవుతారా? అనే చర్చ తొలుత జరిగింది. దేశంలోని మిగతా రాష్ట్రాల సీఎంలతోపాటు ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ప్రభుత్వం ఆహ్వానం పంపింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా చంద్రబాబును కలిసి ఆహ్వానం పలికారు.
ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఉన్న సాన్నిహిత్యం కారణంగా చంద్రబాబు తెలంగాణ సమ్మిట్ కు హాజరవుతారా? అనే చర్చ జరిగింది. కానీ, ఆయన మాత్రం ట్విటర్ లో శుభాకాంక్షలు చెబుతూ, రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. దీంతో ఆయన రావడం లేదని స్పష్టమైంది. ఇక సీఎం హోదాలో రేవంత్ రెడ్డి మొదటిసారిగా భారీ స్థాయిలో అంతర్జాతీయ ఆర్థిక సదస్సు నిర్వహిస్తున్నారు. ఇలాంటి సదస్సులు నిర్వహణ, వాటిలో పాల్గొనడం అంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబే ముందుగా గుర్తుకు వస్తారు. ఆయన సీఎం అయ్యేక ముఖ్యమంత్రులు దావోస్ ఆర్థిక సదస్సుకు వెళ్లడం ప్రారంభమైందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
గత నెలలో సీఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించిన చంద్రబాబు మరోసారి తన బ్రాండ్ నిలబెట్టుకోగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తొలిసారి చేసిన ప్రయత్నంలోనే ఆకట్టుకున్నారని అంటున్నారు. ఈ విషయంలో చంద్రబాబును మించిన స్థాయిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని ప్రశంసలు అందుకుంటున్నారు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లే 2047 నాటికి తెలంగాణలోనూ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సదస్సు ద్వారా వెల్లడైంది.
నిజానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు అయిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఎప్పుడూ మీడియా దృష్టిని ఆకర్షిస్తుంటారు. ఆ ఇద్దరి మధ్య బంధం రాజకీయానికి అతీతంగా వ్యాఖ్యానిస్తుంటారు. అందుకే ఆ ఇద్దరు ఎక్కడ కలిసినా, ఏ కార్యక్రమం చేసినా మీడియాలో ప్రత్యేక చర్చ జరుగుతుంది. ఇద్దరి మధ్య పోలికలు, తేడాలపై డిబేట్ జరుగుతుంటుంది. ఇప్పుడు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పైనా అదేరకమైన విశ్లేషణలు వినిపిస్తుండటం గమనార్హం. ఏపీతో పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా పరిపుష్టి సాధించినా, ఇంకా మెరుగైన స్థితిలో ఉండాలనే ఆశయంతో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోంది. మరోవైపు ఏపీ కూడా ప్రతి నెలా పెట్టుబడి ప్రోత్సాహక సమావేశాలు నిర్వహిస్తూ పెట్టుబడుల వేట సాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య మంచి పోటీ నడుస్తోందని అంటున్నారు.