లిక్కర్‌ సిండికేట్‌గా రియల్‌ మాఫియా!

Update: 2015-07-04 17:30 GMT
నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలోని రియల్‌ ఎస్టేట్‌ మాఫియా ఇప్పుడు లిక్కర్‌ సిండికేట్‌గా రూపాంతరం చెందుతోంది. రాజధాని ప్రాంతంలోని అత్యధికులు మధ్యస్థాయి రియల్‌ వ్యాపారులే. ఇప్పటి వరకు అక్కడ రియల్‌ వ్యాపారం కూడా పెద్దగా లేదు. రాజధాని వచ్చినా ప్రభుత్వం రియల్‌ భూమ్‌ను తొక్కిపారేసింది. దాంతో వారంతా భవిష్యత్తుపై ఆశలు పెట్టుకున్నారు. రాజధాని నిర్మాణం జరుగుతుందని.. అక్కడ బోల్డన్ని భవనాలు వస్తాయని.. వాటిని నిర్మించవచ్చని.. కోట్లకు పడగలు ఎత్తవచ్చని కలలుగన్నారు. కానీ, వారి ఆశలపైనా ప్రభుత్వం కృష్ణా నీళ్లు చిలకరించింది.

నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో జీ+30 భవనాలు తప్ప అంతకు తక్కువ ఎత్తున్న భవనాలకు అనుమతి ఇవ్వరాదని ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా ఒక నిర్ణయం తీసుకుంది. ఇవన్నీ కూడా ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఉండాలని తీర్మానించింది. ఇక అనధికార లే అవుట్లు వేసినా భవనాలు నిర్మించినా ఉక్కుపాదం మోపడం ఖాయమని పూర్తిస్థాయిలో తేల్చి చెబుతోంది. అయితే, జీ+30 భవనాలు నిర్మించడానికి తమకు అంత సాంకేతిక పరిజ్ఞానమూ లేదని అంత అనుభవమూ లేదని, ఒకవేళ ఉన్నా.. అంత సొమ్ములు ఖర్చు చేయగలిగే ఆర్థిక స్తోమత కూడా లేదని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు మదనపడుతున్నారు. ఇక, రాజధానిలో సింగపూర్‌, జపాన్‌, చైనా కంపెనీలతో నిర్మాణాలు చేయిస్తామని ప్రభుత్వం చెబుతోందని, అవన్నీ గ్లోబల్‌ కంపెనీలని, వాటితో పోటీ పడే స్తోమత కూడా తమకు లేదని నిర్థారణకు వచ్చారు.

రాజధాని వచ్చినా రియల్‌ ఎస్టేట్‌ రంగంలో తమకు భవిష్యత్తు ఉండదని భావిస్తున్న వ్యాపారులు.. క్రమంగా ఈ రంగం నుంచి తప్పుకుని మద్యం వ్యాపారంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల జరిగిన టెండర్లలో పెద్దఎత్తున పాల్గన్నారు. షాపులనూ దక్కించుకున్నారు. రాజధాని ప్రాంతం.. దాని చుట్టుపక్కల కొన్ని షాపులన్నీ ఏకమొత్తంగా రియల్‌ వ్యాపారులు దక్కించుకున్నారని ప్రచారం జరుగుతోంది.

Tags:    

Similar News