పవన్ ఫేవరెట్ తెలంగాణ దేవుడి క్షేత్రానికి రూ.35 కోట్లు

గత ఏడాది వారాహి యాత్ర సమయంలోనూ ఎన్నికల తర్వాత జూన్ నెలలో వారాహి దీక్షలో భాగంగా పవన్ కళ్యాన్ కొండగట్టును సందర్శించారు.;

Update: 2025-12-20 12:23 GMT

రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తూ ఏపీ డిప్యూటీ సీఎంగా ఎదిగిన పవన్ కల్యాణ్ తాను భక్తులకు ఇచ్చిన మాటపై నిలబడ్డాడు. తనకు ఇష్టదైవమైన తెలంగాణలోని కొండగట్టు అంజన్న క్షేత్రంపై మరోసారి తనకున్న అపారమైన భక్తిని చాటుకున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తన మాట నిలబెట్టుకుంటూ కొండగట్టు ఆలయ అభివృద్ధికి ఏకంగా రూ.35.19 కోట్ల టీటీడీ నిధులను మంజూరు చేయించడంలో కీలక పాత్ర పోషించారు.

హామీ నెరవేర్చిన డిప్యూటీ సీఎం

గత ఏడాది వారాహి యాత్ర సమయంలోనూ ఎన్నికల తర్వాత జూన్ నెలలో వారాహి దీక్షలో భాగంగా పవన్ కళ్యాన్ కొండగట్టును సందర్శించారు. ఆ సమయంలో భక్తుల రద్దీ దృష్ట్యా సరైన వసతులు లేవని.. దీక్షా విరమణ మండపం అవసరమని భక్తులు, ఆలయ అర్చకులు పవన్ దృష్టికి తీసుకెళ్లారు. అప్పుడు ఆయన ఇచ్చిన హామీ మేరకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు , టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడులతో ప్రత్యేకంగా చర్చించి ఈ నిధులను మంజూరు చేయించారు.

నిర్మాణంలో ఉన్న విశేషాలు..

టీటీడీ నుంచి విడుదలైన ఈ భారీ నిధులతో కొండగట్టులో భక్తుల కోసం మెరుగైన వసతులు కల్పించనున్నారు. దాదాపు 96 గదులతో కూడిన భారీ వసతి గృహాన్ని నిర్మించనున్నారు. ఏటా హనుమాన్ జయంతికి వేల సంఖ్యలో మాలధారుల సౌకర్యార్థం ప్రత్యేకంగా దీక్షా విరమణ మండపాన్ని నిర్మించనున్నారు. దీనివల్ల ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు కూడా బస విషయంలో ఇబ్బందులు తొలిగిపోనున్నాయి.

కొండగట్టు పవన్ కు పునర్జన్మనిచ్చింది.. అందుకే ఈ సేవ

ఈ నిధుల కేటాయింపుపై పవన్ కల్యాణ్ స్పందిస్తూ తన గత జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ఉద్వేగానికి గురయ్యారు. "గతంలో నా ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినప్పుడు భయం వేసి కొండగట్టు అంజన్నను దర్శించుకున్నాను. ఆ తర్వాతే ఒక సభలో నాపై హైటెన్షన్ విద్యుత్ తీగ పడింది. నా పక్కన ఉన్న వారంతా షాక్ తగిలి పడిపోయారు, కానీ స్వామి దయ వల్ల నాకు కేవలం జుట్టు మాత్రమే కాలింది. ఆ రోజు అంజన్నే నన్ను కాపాడారు. అందుకే కొండగట్టు నాకు పునర్జన్మను ఇచ్చిందని నమ్ముతాను" అని ఆయన పేర్కొన్నారు.

సెంటిమెంట్ కు కేరాఫ్.. కొండగట్టు

పవన్ రాజకీయ ప్రయాణంలో ప్రతీ అడుగు ఈ ఆలయంతో ముడిపడి ఉంది. ప్రజారాజ్యం నుంచి జనసేన వరకూ 2009లో ప్రజారాజ్యం యువరాజ్యం అద్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి జనసేన పార్టీ స్థాపన వరకూ ఇక్కడే ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన ఎన్నికల రథం వారాహికి శాస్త్రోక్తంగా పూజ చేయించి కొండగట్టు నుంచే పవన్ ప్రచారానికి వెళ్లారు.

ముందుకు ‘నారసింహ యాత్ర’

కొండగట్టుపై భక్తిని చాటుకోవడమే కాకుండా సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ‘అనుష్టుప్ నారసింహా యాత్ర’ చేపట్టబోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 31 నారసింహా క్షేత్రాలను ఆయన దర్శించుకోనున్నారు. ఈ యాత్ర కూడా కొండగట్టు నుంచే ప్రారంభం కావడం విశేషం.

మొత్తానికి తెలంగాణలోని ఒక ఆధ్యాత్మిక క్షేత్ర అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టీటీడీ ద్వారా నిధులు ఇప్పించడం ద్వారా పవన్ కళ్యాణ్ రెండు రాష్ట్రాల భక్తుల మనసు గెలుచుకున్నారు.

Tags:    

Similar News