పుత్రరత్నాల ఘోరం.. తండ్రికి ఇన్సూరెన్స్ చేయించి చంపేశారు!
పున్నామ నరకం సంగతేమో కానీ.. చాలా మంది పుత్రులు బ్రతికుండగానే తల్లితండ్రులకు ప్రత్యక్ష నరకం చూపిస్తుంటున్నారు.;
పున్నామ నరకం సంగతేమో కానీ.. చాలా మంది పుత్రులు బ్రతికుండగానే తల్లితండ్రులకు ప్రత్యక్ష నరకం చూపిస్తుంటున్నారు. ఇందులో కొంతమంది ఇంటి నుంచి బయటకు గెంటేసేవారు అయితే.. మరికొంతమంది ఆస్తి కోసం నరకం చూపించేవారు మరికొంతమంది! ఈ క్రమంలో.. కన్న తండ్రికి ఇన్సూరెన్స్ చేయించి మరీ హతమార్చిన పుత్రరత్నాల విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన సంచలనంగా మారింది.
అవును... ఇన్సూరెన్స్ మనీ కోసం కన్న తండ్రినే కడ తేర్చిన ఇద్దరు అన్నదమ్ముల విషయం తాజాగా తెరపైకి వచ్చింది. పైగా తమ చేతులకు మట్టి అంటదనుకున్నారో ఏమో కానీ.. ఈ హత్యకు పాము సహాయం తీసుకున్నారు. ఆ పాముతో కాటు వేయించి, తండ్రిని చంపించేశారు. ఇస్నూరెన్స్ సంస్థకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. ఈ పుత్రరత్నాల అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
వివరాళ్లోకి వెళ్తే... తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాకు చెందిన గణేశన్ (56) అనే వ్యక్తి స్థానిక గవర్నమెంట్ స్కూల్లో ల్యాబ్ అసిస్టెంట్ గా పని చేసేవారు. ఈ క్రమంలో ఇటీవల అతడు పాముకాటుతో మరణించినట్లు అక్టోబరులో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంత్యక్రియల అనంతరం అతని పేరు మీద ఉన్న రూ.3 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అతడి ఇద్దరు కుమారులు బీమా సంస్థను ఆశ్రయించారు.
ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ లను ప్రాసెస్ చేస్తున్న సమయంలో దీనితో పాటు గణేశన్ పై అధిక విలువ గల అనేక పాలసీలు ఉండటం గమనించారు. దీనికితోడు అతడి ఇద్దరు కుమారుల ప్రవర్తన కూడా కాస్త సందేహాస్పదంగా ఉండటంతో ఇన్సూరెన్స్ కంపెనీ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇందులో భాగంగా... గణేశన్ మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని.. ఈ కేసులో క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని కోరారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసుపై విచారణ జరపగా.. ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే కుమారులే తండ్రిని పాము కాటుతో చంపించినట్లు గుర్తించారు. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం చేశారని.. అందులో భాగంగానే ముందుగా తండ్రి పేరు మీద రూ.3 కోట్లు ఇన్సూరెన్స్ చేయించారని.. అనంతరం అతడు ప్రమాదవశాత్తు చనిపోయినట్లు నమ్మిచారని.. అందుకు పాము కాటును ఆప్షన్ గా ఎంచుకున్నారని పోలీసులు పేర్కొన్నారు.
ఇందులో భాగంగా... తమ తండ్రి నిద్రపోతున్న సమయంలో అతడి మెడపై కాటు వేయించారు ఇద్దరు పుత్రరత్నాలు.. ఈ సమయంలో అప్పటికప్పుడు ఆస్పత్రికి తీసుకెళ్లకుండా.. ఈ విషయంలోనూ ఉద్దేశ్యపూర్వకంగా ఆలస్యం చేశారని పోలీసులు వెల్లడించారు. దీంతో.. ఇద్దరు కుమారులతో పాటు వారికి సహకరించిన మరొ నలుగురు సహా... మొత్తం అరుగురిని ఈ కేసులో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.