అప్పుడే లుంగి బ్యాచ్ దిగిందా?

Update: 2020-02-06 14:30 GMT
ఏపీకి పరిపాలన రాజధానిగా విశాఖపట్నంను సీఎం జగన్ ప్రకటించ గానే అక్కడ రియల్ భూమ్ ఆకాశాన్ని అంటేసింది. రియల్ మాఫియా అక్కడ కాలు మోపేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీకి అసలు సిసలు రాజధాని విశాఖ కాబోతుందన్న ప్రచారంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ఇప్పుడు విశాఖలోని ఖాళీ భూములపై పడిపోతున్నారు. ఎంతకొస్తే అంతకు పెట్టి కొనేస్తున్నారు. దీంతో విశాఖలో భూములకు రెక్కలు వస్తున్నాయి.

ఈ కోవలోనే ఖాళీ స్థలాలపై అక్రమార్కుల కన్ను కూడా పడుతోంది. కబ్జా రాయుళ్లు రెచ్చిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది.

తాజాగా సీఎం జగన్ ప్రకటనతో విశాఖలో కబ్జా రాయుళ్లు విశృంఖలంగా భూముల కబ్జాలు మొదలుపెట్టారన్న ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఖాళీ స్థలాల్లో అక్రమంగా పాగా వేసేస్తున్నారు. సామాన్యులను బెదిరించి వారు భూములు రాయించుకుంటున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యులకు నయానా భయానా ముట్టజెప్పడం.. వినకుంటే బెదిరిస్తున్న ఘటనలు ఎక్కువ అవుతున్నాయి.

నేతలు, రియల్టర్ల పైనే ఎక్కువగా తాజాగా ఫిర్యాదులు వస్తుండడంతో ఈ భూమాయ విషయం వెలుగు చూస్తోంది.

గత 7 నెలల్లో భూ కబ్జాలపై ఈ తరహా కేసులు విశాఖలో పెరిగిపోవడంతో అక్కడ కబ్జాల తీవ్రత ఎంత స్థాయిలో ఉందో అర్థమవుతోంది. తాజాగా 7 నెలల్లో విశాఖలో భూములపై కేసులు 338 నమోదు కావడం పరిస్థితి తీవ్రత కు అద్దం పడుతోంది. ఓ ప్రజా ప్రతినిధి పై సైతం జిల్లా కలెక్టర్ కు బాధితులు ఫిర్యాదు చేయడం తో విశాఖలో భూదందా ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.
Tags:    

Similar News