ఏపీకి టాటా దన్ను

Update: 2015-08-25 05:28 GMT
రాష్ట్ర విభజన తర్వాత.. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమిటంటూ అయోమయంతో ఉన్న ఏపీ ప్రజలకు.. ఇంతవరకూ ఎవరూ సాంత్వన పలికే చర్య కానీ.. చేయూత కానీ ఇచ్చింది లేదు. అలా చూసినప్పుడు సోమవారం విజయవాడకు వచ్చిన ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ఇచ్చిన భరోసా.. కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పాలి. ఇప్పటివరకూ ఒక గ్రామం లేదంటే ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని దత్తత తీసుకోవటం గొప్పగా ఉండేది.

కానీ.. అందుకు భిన్నంగా టాటాల రేంజ్ కు తగ్గట్లు రతన్ టాటా ఇచ్చిన హామీ దేశంలో సరికొత్త దత్తత కార్యక్రమానికి దన్నుగా మారుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే.. ఒక లోక్ సభా నియోజకవర్గంలోని గ్రామాల్ని దత్తత తీసుకోవటం అంత చిన్న విషయం కాదు. విజయవాడ లోక్ సభ నియోజకవర్గంలోని 264 గ్రామాల్ని దత్తత తీసుకొని.. అభివృద్ధి కార్యక్రమాల్ని చేపడతామని చెప్పటమే కాదు.. తన ట్రస్ట్ ల ద్వారా వీలైనంత సాయం చేస్తామని రతన్ టాటా చెప్పినట్లు ఏపీ ముఖ్మయంత్రి చంద్రబాబు ఆయన పక్క నుంచే ప్రకటించారు.

అంతేకాదు.. రతన్ టాటా వ్యక్తిగతంగా తనకున్న పరపతి.. పరిచయాలను వినియోగించుకొని ఎలాంటి సాయానికైనా సిద్ధమని.. ప్రాజెక్టుల కోసం.. పెట్టుబడుల కోసం.. అవసరమైతే తన పేరును వినియోగించుకోవచ్చని పేర్కొన్నట్లు చెబుతున్నారు. అయితే.. టాటా సంస్థల నుంచి తానేమీ చేయలేనని.. ఎందుకంటే.. టాటా గ్రూపుకు తానిప్పుడు ఛైర్మన్ కానందున ఏమీ చేయలేనని.. కానీ.. టాటా ట్రస్టుల నుంచి ఎలాంటి సాయం కావాలన్నా చేస్తానని చెప్పటం విశేషం.

అయితే.. రతన్ టాటాను ఏపీ రాష్ట్రానికి మెంటార్ గా.. సలహాదారుగా ఉండాలంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరిన కోర్కె ను రతన్ టాటా సున్నితంగా తిరస్కరించారు. సాయం చేసే వ్యక్తిని.. సలహాదారుగా మారిస్తే.. తాను రాజకీయ చక్రబంధంలో చిక్కుకుపోతానని రతన్ లాంటి పారిశ్రామికవేత్తకు తెలీదా? ఏమైనా.. రతన్ టాటా ఇస్తానని చెబుతున్న దన్ను.. ఏపీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పక తప్పదు. మాటల్లోనేనా.. చేతల్లో కూడా అన్నది కాలమే జవాబు చెప్పాలి.
Tags:    

Similar News