కవుల సమావేశమైతే చాలు.. అలా కట్టు తప్పే మాటలేంది రసమయి?

Update: 2021-01-26 07:30 GMT
కవులు.. కళాకారులు సహజంగా స్వేచ్ఛా ప్రియులు. పరిమితులు వారికి అస్సలు వర్తించవు. తమదైన స్వేచ్ఛ ప్రపంచంలో వారు బతుకుతుంటారు. అలాంటి ప్రజా కవులు.. కళాకారులు ప్రజాప్రతినిధులుగా మారితే..వారి పరిస్థితేంటి? వారెలా వ్యవహరిస్తారు? లాంటి ప్రశ్నలు తలెత్తటం ఖాయం. అందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తారు మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. తాజాగా ఆయన ప్రజాకవి జయరాజ్ తల్లి అచ్చమ్మ సంస్మరణ సభకు హాజరయ్యరు. ఈ సందర్భంగా ఆయన తీవ్రమైన ఎమోషనల్ అయ్యారు.

సభకు హాజరైన కవులు..కళాకారుల్ని చూసిన తర్వాత.. తనలోని సహసిద్ధమైన స్వేచ్ఛపిపాసి నిద్ర లేచినట్లున్నాడు. వెనుకా ముందు చూసుకోకుండా.. సారును యాది చేసుకోకుండా.. తన మనసులోని వేదనను బయట పెట్టేశారు. ఒక రకంగా చెప్పాలంటే బరస్ట్ అయ్యారని చెప్పాలి. ఓవైపు నవ్వుతూ.. నవ్విస్తూ మొదలైన ఆయన ప్రసంగం కాసేపటికే గంభీరంగా మారటమే కాదు.. సంచలన వ్యాఖ్యలు చేసేందుకు వెనుకాడలేదు. కళాకారుడికి ఉండే సహజమైన స్వేచ్ఛను ఆయన తీసేసుకున్నారు.

అధికారపక్షంలో ఉన్న తాను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి తనదంటూ తన గోడును వెళ్లబోసుకున్న రసమయి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఒక లిమిటెడ్ కంపెనీల పని చేసినప్పుడు ఆ కంపెనీ పరిధిలో మాత్రమే బతకాలె. కాబట్టి నన్ననాల్సింది లేదు. బయటకెళ్లాలంటే దీంట్ల నుంచి ఇంకో కంపెనీలకు పోవాలె. ఎవడేమనుకున్న ప్రస్తుతానికి నేను దీనిని లిమిటెడ్ కంపెనీగ భావించుకుంట. వాస్తవంగా కొద్దిగా మాట.. పాటను అదుపులో పెట్టుకొని వెల్లదీస్తున్న కాలమిది. మా జయరాజన్న జెప్తడు.. కాలంతో నడిచిన వాడే తీరం చేరుతడు అని. .కాలానికి అటు ఇటూ అడుగులు పడ్డయనుకో ఆగమైపోతం. కాబట్టి నేను బాయా పెయ్యంత కళ్లుజేసుకొని బతుకుతున్న. వాస్తవంగా నేను ఇట్ల బతికెటోన్ని కాదు. ఎందుకంటే నేను నేర్చుకున్న నడక.. పెరిగి వాతావరణం ఎప్పుడూ స్వేచ్ఛగా బతకమని చెప్పింది’ అంటూ తన మనసులోని మాటల్ని నిర్మోహమాటంగా చెప్పేశారు.

ఆకలినైనా చంపుకో బిడ్డా.. ఆత్మగౌరవం చావకుండా చూసుకోమ్మని చెప్పిన అచ్చమ్మ లాంటి నా తల్లి.. నన్నుగూడ అట్ల పెంచిందన్నారు. ‘‘చాలామందికి రకరకాల సమస్యలుంటాయి. ఎందుకు జెప్తున్ననంటే ఉన్నయి.. కొందరికి ఆలోచన్లున్నయి. తెలంగాణ వచ్చిన తర్వాత నేను చాలామందిని చూస్తావున్న. చాలా పాటల్లో మార్పొచ్చేసింది. వ్యక్తులచుట్టూ పాలలైపోయినయి. పండుగలు పబ్బాలన్నీ వాళ్ల నెత్తిమీదికె పోతావున్నయి. నాకొక్కసారి బాధనిపిస్తావుంది. కలాలు.. గళాలు మౌనంగా ఉంటే అది కేన్సర్ కంటే ప్రమాదకరమైనది. సమాజంలో ప్రతి కవి.. గాయకుడు ఆలోచించాల్సిన సమయమొచ్చింది. నా పరిస్థితి ఎట్లయిపోయిందంటే నేను అధికార పార్టీ ఎమ్మెల్యే అయిపోయినంక చాలామంది దూరమైపోయిన్ను’’ అని పేర్కొన్నారు.

మన కళాకారులందరికి ఉద్యోగం ఇవ్వలేదని దూరమైపోయారని.. వాస్తవానికి రెండు వైపులా ఒక్కొక్కసారి ఇబ్బందేనన్నారు. తాను చిన్నోన్ని అని.. ఏదో కొంతమంది పిల్లల్ని పెట్టుకొని నడిపిస్తున్నానని చెప్పారు. ఇటీవల కాలంలో తెలంగాణ అధికార పార్టీకి చెందిన ఏ నేత ఇంత ఓపెన్ గా మాట్లాడింది లేదని చెప్పాలి. మరి.. ఇంత ఓపెన్ గా మాట్లాడిన రసమయి మాటల్ని విని సారు ఎలా స్పందిస్తారో?
Tags:    

Similar News