రమణ దీక్షితులు Vs టీటీడీ ఈవో.. ఎవరు గెలిచినట్టు.?

Update: 2018-05-20 11:29 GMT
రమణ దీక్షితులు.. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రధాన ఆచార్యులు.. ఇటీవల ఆయన టీటీడీలో జరుగుతున్న అవినీతి, ఆగమశాస్త్రం ప్రకారం జరగని పూజల గురించి సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ పాలన గాడితప్పిందని విమర్శించారు. విలువైన నగల్లోని కొన్ని డైమండ్లు కనిపించడం లేదని బాంబు పేల్చారు. ఈ నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వం ఇరుకున పడింది. రమణ దీక్షితులకు వయసైపోయిందని.. ఆయన రిటైర్ కావాల్సిందేనని టీడీపీ నేతలు ఎదురుదాడి చేశారు.  

తాజాగా రమణ దీక్షితులు ఆరోపణలపై టీటీడీ ఈవో ఏకే సింగాల్ స్పందించారు. రమణ దీక్షితులు ఆరోపణలు తిప్పికొట్టేందుకు రెండు రోజులుగా ఆధారాలు సేకరించారు. అనంతరం ఆదివారం విలేకరుల సమావేశంలో సంచలన విషయాలు వెల్లడించారు. శ్రీవారి ఆలయంలో స్వామివారి కైంకర్యాలు, పూజలు శాస్త్రోక్తంగా , ఆగమ శాస్త్రం ప్రకారం జరుగుతున్నాయని తెలిపారు. 1971 నుంచి సుప్రభాత సేవలు ఉదయం 3 గంటలకే ప్రారంభమవుతున్నాయని చెప్పారు. ఆగమ శాస్త్రాలు అంగీకరిస్తే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా పూజా కైంకర్యాలను లైవ్ టెలికాస్ట్ చేస్తామని తెలిపారు.

శ్రీకృష్ణ దేవరాయల కాలం నుంచి నేటి వరకు భక్తులు సమర్పిస్తున్న నగలన్నీ ఎంతో భద్రంగా ఉన్నాయని సింఘాల్ చెప్పారు. ఆభరణాల భద్రతపై రమణ దీక్షితుల ఆరోపణలు అబద్ధమన్నారు. ఇపపటికే రెండు సార్లు రిటైర్డ్ జడ్జీలతో టీటీడీ విచారణ జరిపించామని తెలిపారు. 1952లో తిరు ఆభరణం రిజిస్టర్ లో నమోదైన ఆభరణాలన్నీ భద్రంగా ఉన్నాయని వాద్వా కమిటీ తెలిపిందన్నారు. ఆగమ శాస్త్రాలు అంగీకరిస్తే ఆభరణాలను భక్తుల సందర్శనార్థం ఉంచుతామన్నారు..

ఇలా టీటీడీ లొల్లి పీక్ స్టేజ్ కి చేరిపోయింది. రమణ దీక్షితులు ఆరోపణలకు విరుగుడుగా టీడీపీ ప్రభుత్వం ఈవో సింఘాల్ ను దించింది. ఇప్పుడు లెక్కలు పత్రాలతో సహా ఈవో స్పందించడంతో వార్ ముదిరిపోయింది. మున్ముందు ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతాయోనన్న ఆందోళన సర్వత్రా నెలకొంది.

Tags:    

Similar News