రెండు వారాల్లో ర‌జ‌నీ ఎంట్రీ ప‌క్కాన‌ట‌

Update: 2017-08-09 05:02 GMT
అమ్మ అనారోగ్యంతో త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో సంచ‌ల‌నాలు షురూ అయ్యాయి. అమ్మ మ‌ర‌ణం త‌ర్వాత ఇవి అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. ఎప్పుడూ లేని రీతిలో త‌మిళ‌నాడు రాజ‌కీయాలు జాతీయ స్థాయిలో త‌ర‌చూ పెద్ద పెద్ద వార్త‌లుగా మారుతున్న ప‌రిస్థితి. త‌మిళ‌నాడులో చోటు చేసుకున్న రాజ‌కీయ అనిశ్చితి ఒక‌ప‌క్క‌.. ఆ రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజ‌కీయ శూన్య‌త‌ను భ‌ర్తీ చేసేందుకు వీలుగా ప్ర‌జాద‌ర‌ణ ఉన్న వారు రాజ‌కీయాల్లోకి వ‌స్తార‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతోంది.

కొన్ని సంవ‌త్స‌రాలుగా త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ పొలిటిక‌ల్ ఎంట్రీకి సంబంధించిన ఆస‌క్తిక‌ర చ‌ర్చ జోరుగా సాగుతోంది. రాజ‌కీయాల్లోకి ఆయ‌న రావ‌టం ఖాయ‌మ‌ని.. అందుకు సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ వ‌ర్క్ జ‌రుగుతుంద‌న్న మాట‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండ‌గా.. ర‌జ‌నీ రాజ‌కీయ ఆరంగ్రేటం గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు గాంధేయ మ‌క్క‌ల్ ఇయ‌క్కం అధినేత త‌మిళ‌రువి మ‌ణియ‌న్‌. ర‌జ‌నీని రెండుసార్లు తాను క‌లిశాన‌ని.. రాష్ట్రంలోని రాజ‌కీయ ప‌రిస్థితుల గురించి ర‌జ‌నీ నివాసంలో తాను మూడు గంట‌ల‌కు పైగా చ‌ర్చించిన‌ట్లుగా చెప్పారు.  త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల ప‌ట్ల ర‌జ‌నీ ఎంతో ప్రేమాభిమానులు చాటుకున్నార‌ని.. నాలుగు ద‌శాబ్దాల క్రితం చెన్నైకి వ‌చ్చిన త‌న‌కు సినీ జీవితాన్ని ప్ర‌సాదించిన ప్ర‌జ‌ల‌కు ఆయ‌న ఏదో ఒక‌టి చేయాల‌ని అనుకుంటున్న‌ట్లుగా పేర్కొన్నారు.

ప్ర‌జ‌ల‌కు మేలు చేయాలంటే రాజ‌కీయాల్లోకి రావాల‌ని.. తాను పాలిటిక్స్ లోకి రావ‌టం ప‌క్కా అని త‌లైవా త‌న‌తో చెప్పిన‌ట్లుగా వెల్ల‌డించారు.

ఆస్తుల కోసం తాను రాజ‌కీయ ప్ర‌వేశం చేయ‌ద‌లుచుకోలేద‌ని.. కామ‌రాజ‌నాడార్‌.. అన్నాదురై ఆద‌ర్శంగా.. నిస్వార్థ రాజ‌కీయాలు సాగించాల‌ని తాను కోరుకుంటున్న‌ట్లు చెప్పిన‌ట్లుగా వెల్ల‌డించార‌న్నారు. మ‌రో రెండు వారాల్లో త‌న రాజ‌కీయ రంగ ప్ర‌వేశానికి సంబంధించిన కీల‌క ప్ర‌క‌ట‌న చేస్తార‌న్నారు. త‌న రాజ‌కీయ ప్ర‌వేశంపై ప‌లువురు రాజ‌కీయ నేత‌ల‌తో ర‌జ‌నీ ఇటీవ‌ల కాలంలో స‌మావేశ‌మ‌వుతున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇలాంటి వాద‌న‌లు వినిపిస్తున్న వేళ‌లో త‌మిళ‌రువి మ‌ణియ‌న్ చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. ఆయ‌న చెప్పిన‌ట్లు.. రెండు వారాల్లో ర‌జ‌నీ త‌న రాజ‌కీయ రంగ‌ప్ర‌వేశంపై ప్ర‌క‌ట‌న చేస్తారా? అన్న‌ది చూడాలి.
Tags:    

Similar News