పార్టీ పెట్టకముందే రజినీకి అభిమానుల గుడ్‌బై

Update: 2018-03-23 18:26 GMT
    ఎమ్జీఆర్, ఎన్టీఆర్ వంటి వారికి రాజకీయాలు బాగా కలిసొచ్చాయి కానీ ఇప్పటి సూపర్ స్టార్లకు రాజకీయాలు ఏమాత్రం అచ్చొచ్చినట్లుగా లేవు. తెలుగు రాజకీయాల్లో ఎన్టీఆర్ తరువాత చిరంజీవి మళ్లీ భారీ స్థాయిలో ఎంట్రీ ఇచ్చినా ఆయనపై జనం పెట్టుకున్న ఆశలు కానీ, ఆయన జనంపై పెట్టుకున్న ఆశలు కానీ ఏవీ నెరవేరలేదు. గుడ్డిలో మెల్లలా కేంద్ర మంత్రి పదవి ఒకటి కొద్దిరోజులు వెలగబెట్టి ఇప్పుడు రాజకీయాల్లో ఉనికిలో లేకుండా అయిపోయారు. పొరుగు రాష్ర్టం తమిళనాడులోనూ దిగ్గజ నటుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది .తాజాగా సూపర్ స్టార్ రజినీ కాంత్ రాజకీయ ప్రవేశానికి ఇదిగో అదిగో అంటున్నా కూడా ఇంకా రంగంలోకి దూకలేదు ఒక వేదిక ఏర్పాటు చేశారు. కానీ.. అంతకుముందే ఆయన అభిమానులు అసంతృప్తితో ఆయనకు బాయ్ చెప్తున్నారు.

    తమిళ సంవత్సరాది(ఏప్రిల్‌ 14)న రాజకీయ పార్టీ పేరును రజనీ ప్రకటిస్తారని భావించిన అభిమానులకు రజనీ షాక్‌ ఇచ్చారు. దీంతో వారంతా మండిపడుతున్నారు. ఏప్రిల్‌ 14న పార్టీ పేరును ప్రకటించడం లేదని రజినీ ప్రకటించారు. అదేసమయంలో ఆయన తన పార్టీ దిండిగల్‌ జిల్లా అధ్యక్షుడు తంబురాజ్‌ను పదవి నుంచి తొలగిస్తున్నట్లు రజనీకాంత్‌ పేర్కొన్నారు. దీంతో ఆగ్రహించిన 146 మంది అభిమానులు రజనీ మండ్రమ్‌ నుంచి మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు.

    మరోవైపు తమిళనాడులోనే మరో సీనియర్ నటుడు కమల్ హాసన్ పార్టీ పెట్టినా ఏమాత్రం ప్రభావం కనిపించడంలేదు. ఇక కర్ణాటక విషయానికొస్తే అక్కడ కూడా సీనియర్ హీరో ఉపేంద్ర ఒక పార్టీ పెట్టారు. కానీ.. దాని యాక్టివిటీస్ ఏమీ లేవు. అంతలోనే పార్టీలో ముసలం పుట్టి విభేదాలు తీవ్రమైపోయాయి. దాంతో ఆ పార్టీ పేరుకే మిగిలింది.

    ఇక తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి తమ్ముడు, హీరో పవన్ నాలుగేళ్ల కిందట జనసేన స్థాపించి టీడీపీతో కలిసి నడిశారు. ఇప్పుడాయన టీడీపీకి దూరమై సొంతంగా అవకాశాల కోసం వెతుక్కుంటున్నారు. అయితే... ఏవో కొన్నిసీట్లు సాధించడం మినహా ఆయన కూడా అధికారం అందుకోలేకపోవచ్చన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News