కేసీఆర్ మాట తప్పారంటూ ఆ ఎమ్మెల్యే రాజీనామా?

Update: 2017-03-21 04:17 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఊహించని పరిణామం ఒకటి ఎదురుకానుందా? అంటే అవునని చెబుతున్నారు. మాటలతో తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని.. ప్రజలకు మేలు చేస్తానని నమ్మబలకిన కేసీఆర్.. ఇప్పటివరకూ ఏమీ చేయలేదని.. అందుకు నిరసనగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలంగాణరాష్ట్ర ఎమ్మెల్యేల్లో ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేగా పేరొందిన బీజేపీ నేత రాజాసింగ్ ప్రకటించారు.

సీఎం కేసీఆర్ మాటలతో కాలం గడిపేస్తున్నరన్న ఆరోపణను సంధిస్తూ.. ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. దాన్ని ఆయనకే సమర్పించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. తన నియోజకవర్గ పరిధిలోని దూల్ పేట ప్రజలకు మేలు చేస్తానని చెప్పిన కేసీఆర్.. ఇప్పటివరకూ తన హామీని నిలబెట్టుకోలేదని.. దీనిపై కాలనీ వాసులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు.

అందుకే..తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లుగా చెప్పారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. దాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కు సమర్పిస్తానని వ్యాఖ్యానించారు. ఓటర్ల ఓత్తిడి మేరకే తాను రాజీనామా చేస్తున్న రాజాసింగ్.. ప్రభుత్వం పని చేయకపోతే పోరాటాలతో మెడలు వంచాలే తప్పించి రాజీనామా చేస్తే సరిపోతుందా? అన్న ప్రశ్నను పలువురు సంధిస్తున్నారు.

మరోవైపు.. రాజాసింగ్ రాజీనామా ప్రకటనతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇమేజ్ ను డ్యామేజ్ చేయటంతో పాటు.. ఆయన తన రాజీనామా లేఖను కేసీఆర్ కు ఇవ్వటం రాజకీయ ఎత్తుగడగా పలువురు అభివర్ణిస్తున్నారు. ఏది ఏమైనా.. ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయిన సీఎంగా కేసీఆర్ వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ.. తన రాజీనామాను  లేఖ రూపంలో సంధించటం ద్వారా.. ముఖ్యమంత్రికి ఊహించని షాక్ ఇచ్చినట్లు అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News