ఎక్కడికో చెప్పి మరీ వెళుతున్న ‘యువరాజు’

Update: 2015-12-29 04:23 GMT
పార్టీ నేతలు ముద్దుగా పిలుచుకునే ‘యువరాజు’ పేరుకు తగ్గట్లే కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ అదే తరహాలో వ్యవహరిస్తుంటారు. ఆయన మాటలకు.. చేతలకు అస్సలు సంబంధమే ఉండదు. ప్రతి విషయంలోనూ ప్రశ్నించాలన్నట్లుగా మాట్లాడే రాహుల్.. తనకు సంబంధించిన ఏ విషయం మీదా ప్రశ్నించే అవకాశం ఇవ్వరు. ఉన్నట్లుండి మాయమైపోవటం.. తనకు సంబంధించిన సమాచారం బయటకు పొక్కకుండా ఉండటం లాంటివి రాహుల్ కు వెన్నతో పెట్టిన విద్యలుగా కనిపిస్తాయి.

ఉన్నట్లుండి విదేశాలకు వెళుతుంటారు. సాధారణంగా ప్రముఖులు విదేశీ పర్యటనలు చేసే విషయాన్ని ముందుగా మీడియాతో పంచుకుంటారు. మరీ.. వ్యక్తిగత పర్యటన అయితే.. దేశం పేరు  చెప్పి వదిలేస్తారు. రాహుల్ భయ్యా మాత్రం దీనికి కాస్త భిన్నం. ఆయన విదేశీ పర్యటనల గురించి కనీస సమాచారం కూడా ఇవ్వరు.

ఎక్కడికి వెళుతున్నది వెళ్లేటప్పుడు చెప్పరు.. వచ్చిన తర్వాతా చెప్పరు. విదేశీ పర్యటనల గురించి చెప్పాలన్నది రూలేమీ కాకున్నా.. ఓపెన్ గా ఉంటామని.. ప్రజాసేవకు మినహా తమకేవీ ముఖ్యం కాదన్నట్లుగా చెప్పుకునే రాజకీయ నేతలు.. విదేశీ పర్యటనల గురించి దాచి పెట్టుకోవాల్సిన అవసరం పెద్దగా కనిపించదు. కానీ.. రాహుల్ అందుకు పూర్తి విరుద్ధం.

తన విదేశీ పర్యటనల గురించి ఎలాంటి వివరాలు ఇవ్వని ఆయన.. ఈసారి మాత్రం కాస్త భిన్నంగా తన విదేశీ పర్యటన వివరాల్ని ట్విట్టర్ లో పేర్కొన్నారు. తాను యూరప్ పర్యటనకు వెళుతున్నట్లు వెల్లడించిన ఆయన.. నాలుగు రోజుల ముందే దేశ ప్రజలకు న్యూఇయర్ విషెస్ చెప్పేశారు. గతంలోనూ న్యూఇయర్ సందర్భంగా ఆయన విదేశాలకు వెళ్లటం గమనార్హం.

అయితే.. తాను ఏ రోజు వెళుతున్నది.. మళ్లీ తిరిగి ఎప్పుడు వస్తున్నది లాంటి వివరాలు మాత్రం వెళ్లడించలేదు. రాహుల్ లాంటి వారు న్యూఇయర్ వేడుకలు జరుపుకోవటానికి భారతదేశం అనువుగా ఉండదా? న్యూఇయర్ అయితే చాలు విదేశాలకు వెళ్లిపోవటం ఏమిటి యువరాజా..? చూస్తూ.. చూస్తూ యువరాజా వారిని ఇలాంటి ప్రశ్నలు వేయకూడదేమో..?
Tags:    

Similar News