రాహుల్ మాట‌తో నాలుగున్న‌రేళ్ల ఇమేజ్ ఫ‌ట్‌!

Update: 2018-10-21 04:49 GMT
తెలంగాణ రాజకీయాల్లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఒక రోజు తెలంగాణ రాష్ట్ర ప‌ర్య‌ట‌న కోసం వ‌చ్చిన కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ పుణ్య‌మా అని పార్టీలో కొత్త జోష్ రావ‌టం ఒక ఎత్తు అయితే.. గ‌డిచిన నాలుగున్న‌రేళ్లుగా అవినీతి మ‌కిలి త‌మ‌కు అంట‌ని విధంగా చెప్పే కేసీఆర్ మాట‌ల‌కు తాజాగా బ్రేక్ ప‌డిన‌ట్లైంది. త‌న పాల‌న‌తో నిజాయితీ ఎంతో ఎక్కువన్న మాట‌ను త‌న‌దైన శైలిలో చెప్పే కేసీఆర్‌.. క‌డుపు క‌ట్టుకొని మ‌రీ ప‌ని చేస్తున్న‌ట్లుగా త‌ర‌చూ చెప్పేవారు. త‌మ నిజాయితీకి మోడీ మాట‌ను స‌ర్టిఫికేట్ గా చూపించే వారు. ఇలా త‌న మీద వేలెత్తి చూపించేందుకు ఏ మాత్రం అవ‌కాశం ఇవ్వ‌ని రీతిలో వ్య‌వ‌హ‌రించిన కేసీఆర్ కు దిమ్మ తిరిగేలా షాకిచ్చారు రాహుల్ గాంధీ.

ఇప్ప‌టివ‌ర‌కూ కేసీఆర్ మాట త‌ర్వాత అవినీతి అన్న‌ది లేకుండా చేసుకోగ‌లిగిన గులాబీ బాస్ కు జోరుకు బ్రేకులు వేసేలా రాహుల్ తాజా ఆరోప‌ణ‌లు ఉన్నాయ‌ని చెప్పాలి. అవినీతి కేసీఆర్ అన్న మాట‌ను ఆయ‌న వ్యాఖ్యానించటం.. దానికి ప్ర‌ముఖ మీడియా సంస్థ‌లు అప‌రిమిత‌మైన ప్రాధాన్య‌త ఇవ్వ‌టం కేసీఆర్‌కు ఇబ్బందిక‌రంగా మారుతుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

శ‌నివారం ఒక్క‌రోజులో మూడు స‌భ‌ల్లో (భైంసా.. కామారెడ్డి.. హైద‌రాబాద్ పాతబ‌స్తీ చార్మినార్) పాల్గొన్న రాహుల్‌.. కేసీఆర్ ను టార్గెట్ చేయ‌ట‌మే కాదు.. త‌న ఆరోప‌ణ‌లతో కేసీఆర్ మీద మ‌ర‌క వేసే ప్ర‌య‌త్నం చేశారు. నీతికి నిజాయితీకి నిలువెత్తు రూపం తాను అన్న‌ట్లుగా చెప్పే మాట‌ల్ని మ‌ధ్య‌లో ఆపి.. క్వ‌శ్చ‌న్లు వేసే వాతావ‌ర‌ణాన్ని క్రియేట్ చేయ‌టంలో రాహుల్  స‌క్సెస్ అయ్యార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఎన్నో ఆశ‌ల‌తో తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డింది.. ప్రేమ‌.. శాంతి.. స‌హ‌నంతో రాష్ట్రం ఉంటుంద‌ని.. సుప‌రిపాల‌న అందుతుంద‌ని అంతా అనుకున్నారు.. నాలుగేళ్ల ఈ రాష్ట్రంలో అవినీతి రాజ్య‌మేలింది. తెలంగాణ కార‌ణంగా బాగుప‌డింది కేసీఆర్ కుటుంబం మాత్ర‌మేన‌ని ఆయ‌న మండిప‌డ్డారు.

గ‌డిచిన నాలుగున్న‌రేళ్ల‌లో సాగునీటి ప్రాజెక్టుల అంచ‌నాల‌ను కోట్లాది రూపాయిల‌కు పెంచేసి  అక్ర‌మార్జ‌న‌ల‌కు పాల్ప‌డ్డార‌ని ఆరోపించారు. 15 మంది సంప‌న్న వ్యాపార‌వేత్త‌ల కోసం ప్ర‌ధాని మోడీ ప్ర‌భుత్వాన్ని ఏలుతుంటే.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ త‌న కుటుంబం కోస‌మే ప‌రిపాల‌న సాగిస్తున్నారు. కేసీఆర్‌ కు.. మ‌జ్లిస్‌ కు ఓట్లు వేస్తే మోడీకి వేసిన‌ట్లేన‌ని ఫైర్ అయ్యారు.

అబ‌ద్ధాలు వినాల‌నుకుంటే మోడీ.. స‌భ‌ల‌కు వెళ్లండి. స‌త్యాలు వినాల‌నుకుంటే కాంగ్రెస్ స‌భ‌ల‌కు రండి. 15 ఏళ్లుగా నేను రాజ‌కీయాల్లో ఉన్నా. అబ‌ద్ధాలు ఆడ‌టం మా ఇంటివంటా లేదు. చెప్పిన‌వి చేసి తీర‌తాం. కావాలంటే కర్ణాట‌క‌లో అడిగి చూడండి. కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణ‌లో బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల‌కు కాంగ్రెస్ స‌ర్కారులోనే న్యాయం జ‌రుగుతుంద‌ని చెప్పిన రాహుల్.. గ‌డిచిన నాలుగున్న‌రేళ్ల‌లో కేసీఆర్ అవినీతిప‌రుడ‌ని అంద‌రికి అర్థ‌మైంద‌ని చెప్ప‌టం గ‌మ‌నార్హం. ఇలా.. కేసీఆర్ ను విమ‌ర్శించేందుకు అవ‌కాశం వ‌చ్చిన ప్ర‌తిసారీ.. ఆయ‌నకు అవినీతి జ‌త చేసి ఆరోప‌న‌లు  చేసిన రాహ‌ల్ వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయ‌ని చెప్పాలి. దీనికి తోడు.. కేసీఆర్‌ కు అనుకూలంగా ఉంటాయ‌న్న మీడియా సంస్థ‌ల్లోనూ.. కేసీఆర్ అవినీతి ప‌రుడ‌న్న  రాహుల్ ఆరోప‌ణ‌ల‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News