యువరాజుకు మోడీతో మాట్లాడాలనిపించిందట!

Update: 2016-09-30 14:09 GMT
ఉత్తర దక్షిణ ధ్రువాలు కలుసుకోవటం సాధ్యం కాదన్నది నిజమే. కానీ.. రాజకీయాల్లో అలా ఉండే వారు కలిసిపోవటం.. అవసరమైతే ఒకరినొకరు పొగుడుకోవటం పెద్ద కష్టమైన విషయం కాదన్నది మరోసారి రుజువైంది. దేశ రాజకీయాల్లో మోడీని పూర్తిస్థాయిలో వ్యతిరేకించే వ్యక్తుల్లో ఒకరైన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తాజాగా పొగిడేశారు. మోడీని మెచ్చుకోవటమే కాదు.. ఆయనతో మాట్లాడాలని ఉందన్న వ్యాఖ్యను చేశారు. తాజాగా పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత సైన్యం చేసిన లక్షిత దాడుల నేపథ్యంలో రాహుల్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత సైనికులు చేసిన లక్షిత దాడుల్ని ప్రకటించిన నేపథ్యంలో..ఈ ఇష్యూ మీద స్పందించిన రాహుల్.. గడిచిన రెండున్నరేళ్ల కాలంలో మోడీ తనకు మొదటిసారి ప్రధానమంత్రిలా వ్యవహరించినట్లుగా అనిపించిందంటూ వ్యాఖ్యానించారు. నియంత్రణ రేఖ వద్ద ఉన్న ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడులు జరిపిన వైనాన్ని ఆయన పొగిడేశారు.ఈ ఎపిసోడ్ గురించి రియాక్ట్ అయిన రాహుల్.. తనకు మోడీతో మాట్లాడాలని ఉందన్నారు.

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీసుకునే ఏ చర్యకైనా తమ పూర్తి మద్ధుతు ఉందని ప్రకటించిన రాహుల్.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీసుకునే చర్యలకు కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు.. యావత్ దేశం మొత్తం అండగా ఉంటుందన్న వ్యాఖ్య చేశారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లో నిర్వహిస్తున్న ప్రచారం సందర్భంగా ఆయనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిన్నటికి నిన్న సర్జికల్ స్ట్రైక్స్ పై సోనియమ్మ పొగిడిస్తే.. కాస్త ఆలస్యంగా స్పందించిన కాంగ్రెస్ యువరాజు.. తనదైన శైలిలో పొగిడేయటం గమనార్హం. సోనియమ్మతో పోలిస్తే.. రాహుల్ పొగడ్తల తీవ్రత మోతాదుకు మించినట్లుగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏమైనా రాజకీయ శత్రువు చేత వీర లెవెల్లో పొగిడించుకోవటం మోడీకే సాధ్యమేమో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News