పార్టీ పుట్టిన‌రోజు కంటే ముఖ్య‌మైన ప‌నేంటో?

Update: 2015-12-28 09:44 GMT
కాంగ్రెస్ యువ‌రాజు రాహుల్ గాంధీ తీరు కాస్తంత భిన్నంగా ఉంటుంది. పేద‌ల ప‌ట్ల త‌న‌కెంతో అభిమానం..ఆందోళ‌న ఉంద‌న్న‌ట్లు వ్య‌వ‌హ‌రించే ఆయ‌న‌.. త‌మ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న‌ప్పుడు చేసిందేమైనా ఉందా? అంటే శూన్య‌మ‌ని చెప్పాలి. పార్టీ అధికారంలో ఉన్న ప‌దేళ్లు పార్ల‌మెంటుకు ఆయ‌న హాజ‌రైంది కూడా అంతంత‌మాత్ర‌మే.

ప్ర‌ధాని ప‌ద‌విని చేప‌ట్ట‌టం ఖాయ‌మంటూ 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో భారీగా ప్ర‌చారం సాగ‌టం.. త‌ల బొప్పి క‌ట్టేట‌ట్లుగా దేశ ప్ర‌జ‌లు తీర్పు ఇవ్వ‌టంతో.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదాను కూడా చేజిక్కించుకోలేక ఉండిపోయిన కాంగ్రెస్ పార్టీ ద‌శ‌.. దిశ‌ను మార్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లుగా రాహుల్ చెబుతుంటారు. అయితే.. ఇలాంటి మాట‌లు చెప్పే ఆయ‌న‌.. చేత‌ల్లో మాత్రం అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. కాంగ్రెస్ పార్టీ పెట్టి నేటికి 131 సంవ‌త్స‌రాలు అయిన నేప‌థ్యంలో.. పార్టీ ఆవిర్భావ వేడుక‌ల్ని ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు. ఒక రాజ‌కీయ పార్టీ నేత‌కు.. అందులోకి ఆ పార్టీ యువ‌రాజుకు.. అంత‌కు మించిన కీల‌క‌మైన విష‌యం మ‌రొక‌టి ఉండ‌దు.
 
అదేం చిత్ర‌మో కానీ.. కాంగ్రెస్ వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వ‌మైన సోమ‌వారం (డిసెంబ‌రు 28) ఆయ‌న ప‌త్తా లేకుండా పోయారు. ఢిల్లీలోని పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌రిగిన కార్య‌క్ర‌మానికి పార్టీ అధినేత్రి సోనియాగాంధీ హాజ‌ర‌య్యారు. కానీ.. రాహుల్ మాత్రం క‌నిపించ‌లేదు. పార్టీ కోసం తానెంతో క‌ష్ట‌ప‌డుతున్నాన‌ని చెప్పే రాహుల్‌.. అదే పార్టీ ఆవిర్భావ వేడుకల సంద‌ర్భంగా పార్టీ నేత‌ల్ని క‌ల‌వ‌టం.. పార్టీ కోసం క‌ష్ట‌ప‌డే కిందిస్థాయి నేత‌ల‌తో భేటీ కావ‌టం.. పార్టీ కోసం త‌మ జీవితాల్ని త్యాగం చేసిన కిందిస్థాయి కార్య‌క‌ర్త‌ల్ని గుర్తించ‌టం లాంటివి ఎందుకు చేయ‌రు? అదే ఉంటే.. ఇప్పుడు అయ్య‌గారి గురించి ఇలా మాట్లాడుకోవాల్సిన అవ‌స‌ర‌మే ఉండ‌దేమో.
Tags:    

Similar News