రాహుల్‌ పై ఇంకా దింపుడు కళ్లెం ఆశలు!!

Update: 2015-09-08 03:58 GMT
కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అత్యున్నత విధాన నిర్ణాయక మండలి కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ బుధవారం నాడు ఢిల్లీలో సమావేశం కాబోతోంది. కాంగ్రెస్‌ పార్టీకి కొత్త అధ్యక్షుడు ఎవరు? ఆ బాధ్యతలను మోయబోతున్నది... పార్టీని ముందుకు తీసుకువెళ్లే బాధ్యతను మోయబోయేది ఎవరు అనే విషయమై ఒక నిర్ణయానికి రావడమే ఈ కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ప్రధాన ఎజెండాగా ఉన్నది. అయితే రాహుల్‌ గాంధీ పదవి చేపట్టడానికి విముఖంగా ఉన్నట్టు కొన్నాళ్ల కిందనుంచి వార్తలు వచ్చాయి. ప్రస్తుతానికి సోనియాగాంధీనే.. మరో ఏడాది పాటూ అధ్యక్ష బాధ్యతల్లో కొనసాగించాలని సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చినట్లు ఇదివరలో వార్తలు వచ్చాయి కూడా!

అది నిజమే గానీ.. కాంగ్రెస్‌ పార్టీ మాత్రం.. రాహుల్‌ గాంధీని ఒప్పించడం పట్ల ఇంకా దింపుడు కళ్లెం ఆశలతోనే ఉన్నది. చిట్టచివరి క్షణం వరకూ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి రాహుల్‌ గాంధీని ఒప్పించడానికి సీనియర్‌ నేతలు కొందరు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం పార్టీ కష్టకాలంలో ఉంది. దేశంలోని 29 రాష్ట్రాల్లో 9 రాష్ట్రాల్లో మాత్రమే ఆ పార్టీ అధికారంలో ఉంది. ఇలాంటి క్లిష్ట సమయంలో అధికారం స్వీకరించినప్పుడే.. ఏ కొంత అభివృద్ధి కనిపించినా ఆ క్రెడిట్‌ తప్పకుండా రాహుల్‌ కు వస్తుందని ఆయనకు నచ్చజెబుతున్నారు.

పార్టీకి నాయకత్వం వహించే విషయంలో రాహుల్‌ కు ఒక మూడ్‌ క్రియేట్‌ చేయడానికే.. కాంగ్రెస్‌ పాలనలో లేని రాష్ట్రాల సీఎల్పీ లీడర్ లను పిలిపించి ఓ ప్రత్యేకసమావేశం కూడా నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో పార్టీ బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో వారితో రాహుల్‌ చర్చించారు. అంటే తన టీం ఎలా ఉండబోతుందో ఆయనకు చూపిస్తున్నారన్నమాట. ఇదంతా చూసి అయినా ఆయన సారథ్యానికి ఒప్పుకుంటరని పార్టీ ఆశిస్తోంది. కనీసం చివరిక్షణాల్లో అయినా రాహుల్‌ గాంధీ సారథ్యానికి ఒప్పుకుంటే.. సోనియా విశ్రాంతి తీసుకోవచ్చు. అంతే తప్ప సోనియా కుటుంబం నుంచి బయటి వారికి అధ్యక్ష స్థానం కట్టబెట్టే ఉద్దేశం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Tags:    

Similar News